డీసీసీ పీఠం ఎవరికో.. 

TS Congress  Leaders Wait For DCC President Post - Sakshi

రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి అధ్యక్షుడు కొనసాగుతున్నారు. కొత్త జిల్లాలకు ప్రత్యేకంగా అధ్యక్షుణ్ణి నియమించాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్న తరుణంలో కామారెడ్డితో పాటు, నిజామాబాద్‌ కు అధ్యక్షుడి నియామకం చేస్తారని చర్చ సాగుతోంది. డీసీసీ పదవికి పోటీ ఏర్పడింది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జి అధ్యక్షుడిని కొనసాగిస్తారా.? లేదా ఈ స్థానంలో కొత్త వారిని నియమిస్తారా.? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన తాహెర్‌బిన్‌ హందాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని నిజామాబాద్‌ నగర అధ్యక్షులుగా ఉన్న కేశవేణుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పదవిలో ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా ప్రత్యేకంగా అధ్యక్షుణ్ణి నియమించాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ పదవి తెరపైకి వచ్చింది.

కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించినప్పుడే., నిజామాబాద్‌ జిల్లాకు కూడా అధ్యక్షున్ని ప్రకటించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నేతలు అన్ని మండలాల్లో ఉన్న పార్టీ నేతలు, క్యాడర్‌ను కలుపుకుని పనిచేయాల్సి ఉంటుంది. ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులను సమన్వయం చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం విదితమే. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాల్లో కేవలం ఒకే ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు. దీంతో ఆ పార్టీ నాయకులతో పాటు, కేడర్‌లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించి, శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా చేయడంలో డీసీసీ నేతలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులతో సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రె డ్డి, ఏఐసీసీ నేతలు శ్రీనివాస్‌ కృష్ణన్‌లు జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యా రు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డీసీసీ పదవి విషయం ప్రత్యేకంగా చర్చ కొచ్చింది. అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జులు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని జిల్లా నేతలకు సూచించినట్లు సమాచారం.  కొందరు నేతలు డీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top