దూసుకెళ్లిన కారు

TRS Speed In Telangana Panchayat Election - Sakshi

హుజూరాబాద్‌రూరల్‌: మూడో విడత పంచాయతీలు ఎన్నికలు బుధవారం ప్రశాం తంగా జరిగాయి. హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, వి.సైదా పూర్‌ మండలాల్లో తుది దశ ఎన్నికలు నిర్వహించారు. 109 గ్రామపంచాయతీలకు గాను, 13 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 96 గ్రామపంచాయతీల్లోని సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 1024 వార్డులకు గాను 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా... ఏకగ్రీవ పంచాయతీలతో కలుపుకుని మొత్తం 817 పంచాయతీలలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయఢంకా మోగించారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు దీటుగా.. టీఆర్‌ఎస్‌కు పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు పట్టం కట్టారు. బుధవారం జరిగిన మూడో విడతలో మొత్తం 407 పంచాయతీలకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో ఎన్నిక వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 406 పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ 279, కాంగ్రెస్‌ 55 బీజేపీ 15, టీడీపీ 02, స్వతంత్రులు 55 స్థానాల్లో గెలుపొందారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఈ విడతలో కాంగ్రెస్‌కు అత్యధికంగా 40 చోట్ల విజయం చేకూరింది. అసెంబ్లీ ఎన్నికల విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్‌.. పంచాయతీ ఎన్నికల్లోను జోరు కొనసాగడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

మూడు విడతల్లోనూ ఆధిక్యమే...
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ మూడు విడతల్లో కూడా అత్యధికంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 21న మొదటి విడతలో మొత్తం 414 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా టీఆర్‌ఎస్‌ 289, కాంగ్రెస్‌ 82 చోట్ల గెలుపొందగా, బీజేపీ ఎనిమిది, టీడీపీ 03 స్వతంత్రులు 32 చోట్ల విజయం సాధించారు. రెండో విడతలో 389 పంచాయతీలకు 249 టీఆర్‌ఎస్, 68 కాంగ్రెస్, 16 బీజేపీ, 01 టీడీపీ, 07 సీపీఐ, 48 స్వతంత్రులు గెలుచున్నారు. బుధవారం జరిగిన మూడో విడతలో 407 పంచాయతీలకు 279 టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఎన్నిక కాగా, 55 కాంగ్రెస్, 15 బీజేపీ, టీడీపీ 02, స్వతంత్రులు 55  గెలుచుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జరిగిన మూడు విడతల ఎన్నికల్లో బీజేపీ 39 స్థానాలకు పరిమితం కాగా, సీపీఐ ఏడింట గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఫలితాలు మరింతగా దిగజారిపోయాయి. కేవలం ఆరు స్థానాలకే పరిమిత కావాల్సి వచ్చింది.

2013లో ఎన్నికల్లో 379కే టీఆర్‌ఎస్‌ పరిమితం...
2013లో పూర్వ కరీంనగర్‌ జిల్లాల్లో 1207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. 379 గ్రామాల్లో టీఆర్‌ఎస్, 372 పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 137 టీడీపీ, 37 బీజేపీ, 30 వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. 17 చోట్ల సీపీఐ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 235 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. అయితే 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గ్రామాలు అభివృద్ధి బాటన నడవాలంటే అధికార పార్టీ పంచన చేరడమే మేలని’ భావించిన చాలా మంది సర్పంచ్‌లు ప్లేట్‌ ఫిరాయించారు.

దీంతో మూడింట రెండు వంతులకు పైగా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగరవేసింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌ ప్రాతినిథ్యం వహించడం, జగిత్యాల నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో పలువురు ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది ఆగస్టు 2న సర్పంచ్‌లు పదవీ విరమణ చేసే నాటికి 942 మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నట్లుగా అప్పట్లో ప్రకటించారు. తాజా ఎన్నికల్లో మొత్తం 1210 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా... ఏకగ్రీవ పంచాయతీలో కలుపుకుని మొత్తం 817 పంచాయతీలలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయఢంకా మోగించడంతో ఉమ్మడి జిల్లాలో గులాబీ గుబాళించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top