పార్టీకి అండగా గులాబీ దండు

TRS President KCR Concerntrates On Construction Of party - Sakshi

జిల్లా సమన్వయ కర్తా..? జిల్లా అధ్యక్షుడా .?

కొత్తగా కమిటీల ఏర్పాటు.. పటిష్టంగా గులాబీసేన

సంస్థాగత నిర్మాణంపై కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి

‘స్థానిక’ సంస్థల్లో సత్తా చాటడమే లక్ష్యం

సర్పంచ్‌ ఎన్నికల నుంచి కౌంట్‌డౌన్‌ 

రెండు పార్లమెంట్‌ స్థానాలకు జనరల్‌ సెక్రెటరీలు

ఫిబ్రవరిలో భారీగా పార్టీ  సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఈనెల 28 తర్వాత జిల్లాకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రాష్ట్ర కార్యవర్గభేటీలో జిల్లా నేతలకు కేటీఆర్‌ మార్గదర్శనం 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కారు స్పీడు మరింత పెంచేందుకు సంస్థాగత నిర్మాణం, పటిష్టతపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ తగ్గకముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెరలేచింది. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ యువనేత, మాజీమంత్రి కేటీఆర్‌కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలను కట్టబెట్టారు. అధికారికంగా కేటీఆర్‌ సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అంతకంటే ముందే శనివారం తెలంగాణభవన్‌లో తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానుంచి పలువురు పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై మార్గదర్శనం చేస్తూ.. ఈనెల 28 తర్వాత తన పర్యటన ఉంటుందని కేటీఆర్‌ చెప్పినట్లు నాయకులు తెలిపారు. బూతు కమిటీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ఆయన మార్గదర్శనం చేశారు.
 
జిల్లా సమన్వయ కర్తా? లేక అధ్యక్షుడా? సీఎం నిర్ణయమే తరువాయి

తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి సీనియర్‌ నేత కే.కేశవరావుతోపాటు 62 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి పలువురు పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన, సహాయ కార్యదర్శులు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టత కోసం జిల్లా, మండల, గ్రామ కమిటీల పునరుద్ధరణ చేయాలని పలువురు సూచించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేసిన పిదప ప్రకటనే తరువాయిగా మారగా.. చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఇదే సమయంలో ఈసారి సభ్యత్వ నమోదుకు ముందే కమిటీలు వేయాలని జిల్లాకు చెందిన పలువురు కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో జిల్లా సమన్వయకర్తను నియమించడమా..? లేదంటే పాత పద్ధతిలో జిల్లా అధ్యక్షుడు, కమిటీలు వేయడమా? అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంకాగా.. కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుందామని కేటీఆర్‌ చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.

డిసెంబర్‌ 26 నుంచి జనవరి 5 వరకు జిల్లాలో జరిగే ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని, నమోదు చేసుకోని, నమోదు చేసుకున్న మిస్సయిన వారు తిరిగి నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు.
వచ్చేనెల 3, 6, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. ఒక్కో గ్రామం నుంచి సర్పంచ్‌ పోటీచేసే అభ్యర్థులు ఒక్కరే ఉండేలా చూడాలని, వీలైతే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కేటీఆర్‌ సూచించినట్లు నేతలు తెలిపారు. త్వరలోనే పార్టీ, అనుబంధ కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నామని, ఇందుకోసం ఉద్యమ సమయం నుంచి పనిచేసిన అందరికీ అవకాశం కల్పించడం కోసం జిల్లా నాయకత్వం చొరవ చూపాలన్నారు. 

రెండు పార్లమెంట్‌ స్థానాలకు జనరల్‌ సెక్రెటరీలు..ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదు
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాల పరిధిలో పార్టీని మరింత పటిష్టంగా తయారు చేసేందుకు ఇన్‌చార్జిలుగా జనరల్‌ సెక్రెటరీలను నియమిస్తామని కేటీఆర్‌ జిల్లా నేతలకు స్పష్టం చేశారు. అలాగే పార్లమెంట్‌ స్థానాలకు నియమించేవారికి సహాయకులుగా ఆయా పార్లమెంట్‌ పరిధిలోని మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఒక్కరి చొప్పున నియమించనున్నారు. కరీంనగర్, పెద్దపల్లితోపాటు నిజామాబాద్‌ పార్లమెంట్‌ కిందకు వచ్చే ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు కూడా ఇక్కడినుంచే జనరల్‌ సెక్రెటరీకి తోడు ఒకరిని సహాయకుడిగా నియమించనున్నారని తెలిసింది.

సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం కమిటీలతోపాటు పెద్ద మొత్తంలో పార్టీ సభ్యత్వం నమోదు చేసేందుకు ఫిబ్రవరి నుంచి శ్రీకారం చుట్టాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గత సభ్యత్వం 7.60 లక్షలుగా నమోదుకాగా.. ఈసారి అంతకుమించి కనీసం 20 శాతం అదనంగా చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. తద్వారా టీఆర్‌ఎస్‌లో సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా కార్యకర్తలకు ధీమాగా ఉంటుందన్న కోణంలో కూడా కేడర్‌ సిద్ధం చేయాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ అటు జనరంజక పాలన.. ఇటు పార్టీ నిర్మాణంపై కసరత్తు చేస్తుండగా, గులాబీశ్రేణుల్లో జోష్‌ మరింత కనిపిస్తోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top