దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ది కీలక పాత్ర

TRS Play Important Role In All Over Indian Politics - Sakshi

 సాక్షి, బంజారాహిల్స్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఇప్పటికే సభలు సమావేశాలతో జోరుమీదుంది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి కిందకు వచ్చే ఖైరతాబాద్‌ బాధ్యతలను హోంమంత్రి మహమూద్‌ అలీకి అప్పగించారు. ఈయన నేతలకు దిశానిర్దేశం చేసే కార్యక్రమాన్ని శనివారం బంజారాహిల్స్‌లోని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 13న సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో యువ నేత, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, ఖైరతాబాద్‌ బలమేంటో ఈ సభలో చూపించాలని నేతలకు సూచించారు. దానం నాగేందర్‌తో పాటు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మెజార్టీకి మించి పార్లమెంట్‌ అభ్యర్థికి రికార్డు స్థాయిలో ఆధిక్యాన్ని తీసుకురావాలని శ్రేణులను ఆదేశించారు. ఇందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, దేశం ఫడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం చూస్తోందన్నారు. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని, దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమే అయినా మెజార్టీ ఆధిక్యాన్ని చూపించాలని, ఆ మెజార్టీలో ఖైరతాబాద్‌ ముందుండాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్ర ప్రయోజనాలను తప్పకుండా నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి బండి రమేష్‌ కూడా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top