సందడే సందడి..

TRS Leaders Pragathi Nivedana Sabha Rangareddy - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌ (రంగారెడ్డి): అన్ని అడుగులు కొంగరకలాన్‌లోని ప్రగతి నివేదన సభా ప్రాంగణం వైపే పడుతున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభలో కుర్చోవడానికి నిర్వాహకులు దాదాపు 70 వేల కుర్చీలు, 50 వేల చదరపు అడుగుల గ్రీన్‌ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. శనివారం మంత్రులు  కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
 
సందడే సందడి..  
శనివారం ప్రగతి నివేదన సభ స్థలం వద్ద కోలాహోలం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గడ్డపై సభ జరుగుతుండటంతో వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని గిరిజన మహిళలు 300 మంది తమ సాంప్రదాయ వేషధారణలో అక్కడికి చేరుకొని సుమారు అరగంటపాటు నృత్యాలు చేశారు. వారు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చుట్టూ చేరుకొని సందడి చేశారు. గిరిజనుల ఆటలను చూసి మంత్రి మంత్రముగ్దులయ్యారు. చాలా చక్కగా ఆటపాడారని అభినందించారు.
  
రోడ్లపై సూచికలు ఏర్పాటు  
ప్రగతి నివేదన సభకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళ్‌పల్లి–కొంగరకలాన్, ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి సభా స్థలం, రావిర్యాల్‌ నుంచి సభా స్థలం వద్దకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.  సభా స్థలం, పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించడానికి, సభకు రాకపోకలు వారి కదలికలను గుర్తించడానికి పోలీసులు కమోండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. దీనిని మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌ పరిశీలించారు. నిరంతరం నిఘాపెట్టాలని పోలీసులను అదేశించారు.
 
కళాకారుల కోసం ప్రత్యేక వేదిక  
సభ సాయంత్రం ప్రారంభం కానుండడంతో ఉదయం నుంచి వచ్చే జనాలను ఆకర్షించేందుకు కళాకారులు ఆడిపాడేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ యాస, భాషతో కూడిన సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందు కోసం వేదికకు ఎడమ వైపు దాదాపు వంద మంది కళాకారుల కోసం ఏర్పాట్లు చేశారు. సభకు పెద్దఎత్తున ప్రజలు హాజరు కానుండటంతో రోడ్లపై దుకాణాలు వెలిశాయి. వాటర్‌ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్‌తో పాటు ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top