ఓదెలు ఆశలపై పెట్రోల్‌ మంట!

TRS Leaders odelu Followers Suicide Attempt Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘అదృష్టం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది’ ఈ తెలుగు సామెత చెన్నూర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పరిస్థితికి చక్కగా సరిపోతుంది. చెన్నూర్‌లో మూడుసార్లు గెలిచి ప్రభుత్వ విప్‌గా నాలుగేళ్లు బాధ్యతలు నిర్వర్తించిన నల్లాల ఓదెలును దురదృష్టం వెంటాడి ఈసారి సీటు గల్లంతైన విషయం తెలిసిందే. తన సీటును తనకివ్వాలని ఆయనతో పాటు అనుచరులు కూడా గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆవేశపూరితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు  ప్రతికూలంగా మారుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇందారంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూర్‌ టీఆర్‌ఎస్‌ టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందారానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ నాయకుడు, మాజీ వార్డు మెంబర్‌ రేగుంట గట్టయ్య బుధవారం మధ్యాహ్నం ఇందారంలో పెట్రోల్‌ సీసాతో హల్‌చల్‌ చేశాడు.

రాజీవ్‌ర హదారి నుంచి ఇందారం గ్రామానికి వెళ్లే దారిలో ఓ సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి సుమన్‌ భూమిపూజ చేసి, ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి రాగా, మహిళలు హారతి పడుతున్నారు. అదే సమయంలో లీటరు పెట్రోల్‌ సీసాతో వచ్చిన రేగుంట గట్టయ్య జై కేసీఆర్‌.. జై ఓదన్న అని నినాదాలు చేస్తూ పెట్రోల్‌ పోసుకునేయత్నంలో సీసాను గట్టిగా ఒత్తడంతో పెట్రోల్‌ తనపైనే కాకుండా అక్కడున్న పలువురు నాయకులు, మహిళలపై పడింది.

అతడు ఉద్దేశపూర్వకంగా చేశాడో, భయపెట్టేందుకు చేస్తున్నాడో తెలియకపోయినా... పెట్రోల్‌ మహిళల చేతుల్లోని హారతులపై పడడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. పెట్రోల్‌ పట్టుకొచ్చిన గట్టయ్యకు మంటలు అంటుకోగా, శ్రీరాంపూర్‌ సీఐ నారాయణ్‌నాయక్, మహ్మద్‌ జైనుద్దీన్‌ పక్కన ఉండడంతో సుమన్‌కు ప్రమాదం తప్పింది. సుమన్‌ను అక్కడినుంచి నారాయణ్‌ నాయక్‌ తోసివేయడంతో ఎలాంటి గాయం కాలేదు. అదే సమయంలో జైనుద్దీన్‌కు తీవ్ర గాయాలు కాగా, సీఐ నారాయణ్‌ నాయక్‌ చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన చెన్నూర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సానుభూతిని కాకుండా వ్యతిరేకతకు కారణం కావడం గమనించాల్సిన విషయం.

అవకాశాన్ని అనుకూలంగా  మార్చుకున్న సుమన్‌
ఈ సంఘటనను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎంపీ సుమన్‌ సఫలమయ్యారు. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న సుమన్‌ తనను హత్య చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే గట్టయ్య పెట్రోల్‌ చిమ్మాడని ఆరోపించారు. అదే సమయంలో మరో వ్యక్తి అగ్గిపెట్టెతో సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు. తనను హతమార్చే ఉద్శేంతోనే పెట్రోల్‌తో ఒకరు, అగ్గిపెట్టెతో మరొకరు కార్యక్రమానికి హాజరైనట్లు ఆయన వివరించారు. పెట్రోల్‌ పోయగానే వేరే వ్యక్తి అగ్గిపెట్టె వెలిగించాల్సి ఉండగా, మంగళహారతి కారణంగా మంటలు లేసి కాలిపోవడం జరిగిందని వివరించారు. జైనుద్దీన్, సీఐ నారాయణ నాయక్‌ తనను కాపాడారని, వారు లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆ తర్వాత జైపూర్‌లో మీడియాకు చెప్పిన సుమన్, చెన్నూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కూడా స్పష్టం చేశారు.

తనకు టికెట్టు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ఓదెలు వర్గం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఎదుర్కొంటానన్నారు. కేసీఆర్‌ శిష్యుడిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకొచ్చారు. కాగా తనపై హత్యాయత్నం జరిగినట్లు సుమన్‌ ప్రకటించగా, శివ్వారం గ్రామ మాజీ సర్పంచ్‌ విశ్వాంబర్‌రెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 307 కింద హత్యాయత్నం కేసు నమోదైంది. ఇదంతా చెన్నూర్‌ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు చిక్కులు తెచ్చేదిగా తయారవడం గమనార్హం.

స్వీయ గృహ నిర్బంధంపై పార్టీ సీరియస్‌
చెన్నూర్‌ అభ్యర్థిగా సుమన్‌కు టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్లాల ఓదెలు మందమర్రిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వీయ గృహ నిర్బంధం విధించుకొని నిరసన వ్యక్తం చేశారు. తనకేమైనా సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని మీడియాకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ఓదెలు ప్రయత్నాన్ని విరమింపజేయాల్సిందిగా రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలను ఆదేశించారు. ఇంద్రకరణ్‌రెడ్డి మందమర్రికి వచ్చి ఓదెలును కలవాల్సి ఉన్నప్పటికీ, కొండగట్టులో బస్సు ప్రమాదం సంఘటన నేపథ్యంలో ఆయన రాలేదు. ఈ పరిస్థితుల్లో ఎంపీ సంతోష్‌కుమార్‌ ఓదెలుకు ఫోన్‌ చేసి బుధవారం ప్రగతిభవన్‌లో అందుబాటులో ఉండాలని చెప్పారు. దాంతో ఓదెలు నిరసన విరమించారు. అయితే ఓదెలు చర్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. 

సీఎంను కలవని ఓదెలు..
ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతిభవన్‌కు బుధవారం ఉదయమే వెళ్లిన ఓదెలుకు మధ్యాహ్నం 3గంటలకు సీఎం అపాయింట్‌మెంట్‌ లభించినట్లు సమాచారం. దీంతో ఆయన వేచిచూస్తున్న సమయంలోనే ఇందారం సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు కారణమైన రేగుంట గట్టయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించినట్లు సమాచారం రావడంతో ఓదెలు సీఎంను కలవకుండానే వరంగల్‌ బయలుదేరి వెళ్లారు. ఈ సంఘటనల నేపథ్యంలో ఓదెలుపై చర్యలు తీసుకునేందుకు కూడా పార్టీ వెనుకాడకపోవచ్చని సమాచారం.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top