కామారెడ్డిలో త్రిముఖ పోరు..

Triangle Fight On  Kamareddy Constituency In Nizamabad - Sakshi

ముగ్గురికీ గెలుపు  ప్రతిష్టాత్మకం

పోటాపోటీగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు

ఆరోపణలు, విమర్శలకు పదును.. 

రసవత్తరంగా మారిన రాజకీయం

కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొంది. చిరకాల ప్రత్యర్థులైన కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌లతోపాటు బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా గెలుపుకోసం నువ్వానేనా అన్నట్లుగా పోరాడుతున్నారు. ముగ్గురు నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది.    

సాక్షి, కామారెడ్డి: జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన కామారెడ్డి నియోకజవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. ముగ్గురికీ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఆరోపణలు, విమర్శలకు పదునుపెడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీజేపీ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే నువ్వానేనా అన్న రీతిలో పోరు సాగుతోంది.

ఎన్నికల తేదీ సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు విమర్శలు, ఆరోపణల దాడి పెంచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్, కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండగా.. ఆ ఇద్దరినీ టార్గెట్‌ చేసి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఆరోపణలు సంధిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ముగ్గురూ బలమైన అభ్యర్థులు కావడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నడుస్తోంది. ముగ్గురికీ గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపుకోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. హోరాహోరీ ప్రచారం సాగుతుండడంతో విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోంది. రకరకాల సమీకరణాలు ఉండడంతో గెలుపెవరిదో అంచనా వేయలేకపోతున్నారు.

చాపకింద నీరులా.. 

నియోజక వర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలకు బలమైన క్యాడర్‌ ఉంది. దీంతో ఈసారీ ఆ పార్టీల అభ్యర్థుల మధ్యే పోరు ఉంటుందని అందరూ భావించారు. అయితే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకటరమణారెడ్డి కూడా ప్రధాన పోటీదారుగా మారారు. ఆయన ప్రతి ఇంటి తలుపు తడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. చాపకింద నీరులా ఆ పార్టీ బలం పుంజుకుంటుండడంతో పోరు రసవత్తరంగా మారింది. 

సర్వశక్తులు ఒడ్డుతున్న షబ్బీర్‌అలీ

కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో షబ్బీర్‌అలీ కీలకమైన స్థానంలో ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఆయన విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. షబ్బీర్‌ అలీ 1989లో తొలిసారి కామారెడ్డినుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి కూడా పొందారు. నియోజకవర్గంలో మంత్రి పదవి పొందిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే.. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి చెందారు. 2004 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్రెడ్డి క్యాబినెట్‌లో కీలకమైన విద్యుత్‌ శాఖ మంత్రిగా పనిచేశారు.

2009, 2014 ఎన్నికల్లో షబ్బీర్‌అలీ ఓటమి చెందారు. అనంతరం శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన షబ్బీర్‌అలీ.. మండలి విపక్ష నేతగా కూడా పనిచేస్తున్నారు. గెలిచినా, ఓడినా నియోజక వర్గంలో పార్టీ శ్రేణులు, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈసారీ పోటీలో ఉన్న షబ్బీర్‌అలీ రెండు నెలలుగా నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ తాను మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభను నిర్వహించడంతో పాటు రేవంత్‌రెడ్డి రోడ్‌షోలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈసారి విజయం తనదేనన్న గట్టి ధీమాతో ఉన్న షబ్బీర్‌అలీ.. విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘గంప’ 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఎలాగైనా ఈసారి కూడా విజయం సాధించి తన పట్టును నిలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకోసం రెండున్నర నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.గంప గోవర్ధన్‌ తొలిసారిగా 1994లో కామారెడ్డినుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో అవకాశం దక్కలేదు. 2004లో ఎల్లారెడ్డినుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగిన సమయంలో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2011 ఉప ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2014 ఎన్నికల్లోనూ గెలిచారు. వరుస విజయాలను సొంతం చేసుకున్న గంప గోవర్ధన్‌ ఈసారి కూడా విజయం సాధించడానికి ప్రజాక్షేత్రంలో విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో నియోజక వర్గంలో వందలాది కోట్లతో జరిగిన అభివృద్ధి పనులతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌ ఉండడంతో వారితో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటు చేసి భారీ ఎత్తున జనాలను తరలించారు. సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. 

ఒక్క అవకాశం ఇవ్వమంటున్న వెంకటరమణారెడ్డి

బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జెడ్పీ మాజీ చైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కామారెడ్డి రూపురేఖలు మారుస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రెండు నెలలుగా ఆయన ఊరూరా తిరుగుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లినపుడు అక్కడే రాత్రిళ్లు నిద్రిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆయన నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఇంటి తలుపుతట్టారు. ఊరూరా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రావాల్సిన వడ్డీరాయితీ బకాయిలపై వెంకటరమణారెడ్డి మూడు నెలల క్రితం చేపట్టిన ఉద్యమం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. వెంకటరమణారెడ్డి దశలవారీ ఉద్యమాలు, రిలేదీక్షలు చేశారు. నిరవధిక నిరాహార దీక్షకూ దిగారు.

దీంతో మహిళల మద్దతు పొందారు. తరువాత యువతపై దృష్టి సారించిన వెంకటరమణారెడ్డి.. జిల్లా కేంద్రంలో యువతను చైతన్యపరిచే విధంగా  ఓపెన్‌ డిబేట్‌ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో ఇసుకమాఫియా, మద్యం మాఫియాకు కళ్లెం వేసిన వెంకటరమణారెడ్డి.. తనకు అవకాశం ఇస్తే కామారెడ్డి నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గంలో తన ప్రత్యర్థులిద్దరిపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తూ నీతివంతమైన పాలన కోసం తనను గెలిపించాలని కోరుతున్నారు. వెంకటరమణారెడ్డికి మద్దతుగా ఇప్పటికే స్వామి పరిపూర్ణానంద కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించారు. వచ్చేనెల రెండో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కామారెడ్డిలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top