నేడే పీఎం–కిసాన్‌ నిధుల బదిలీ

Transfer of PM Kisan funds is today - Sakshi

గోరఖ్‌పూర్‌లో ప్రారంభించనున్న ప్రధాని 

రాష్ట్రంలో కొందరు రైతుల ఖాతాల్లో జమ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని 10.30 నుంచి 11 గంటల వరకు పీఎం–కిసాన్‌ ముఖ్య ఉద్దేశాన్ని, 11 నుంచి 11.30 వరకు మన్‌ కీ బాత్‌ కార్యక్రమం, 11.30 నుంచి 12.30 వరకు పథకం ప్రారంభం, ఆకాశవాణి, దూరదర్శన్‌ ప్రసారాలుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లోని గ్రామాల నుంచి కొందరు రైతులకు రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా తెలిపారు.

పీఎం–కిసాన్‌ వెబ్‌సైట్‌లో మొత్తం 17 లక్షలకు పైగా అర్హులైన రైతుల బ్యాంకు వివరాలు, ఆధార్‌ నెంబర్లను ఆప్‌లోడ్‌ చేశారు. మిగతా వివరాలను త్వరలోనే అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇందులో కొందరు రైతులకు ఆదివారం పెట్టుబడి సాయం జమ కానుంది. ఇప్పటికే 5 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధుల విడుదలకు సంబంధించి టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. విడతల వారీగా రైతులందరికీ పెట్టుబడి జమ అవుతుందని తెలిపారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయశాఖ అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ప్రతి సహాయ వ్యవసాయాధికారులు డివిజన్‌ స్థాయిలో జిల్లా, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో లబ్ధిదారుల సమక్షంలో ప్రారంభించాలని, లబ్ధిపొందే రైతులను ఎక్కువ సంఖ్యలో ఆహ్వానించాలని ఆదేశాలు జారీచేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top