కరోనా: మరో 5 పాజిటివ్‌లు

Total 15 Cases Filed In Nirmal District Till Thursday - Sakshi

జిల్లాలో 15కు చేరిన పాజిటివ్‌ కేసులు

24 గంటల వ్యవధిలోనే 11 నమోదు

ప్రాథమిక సంబంధీకులకూ వైరస్‌ వ్యాప్తి

సీరియస్‌గా తీసుకున్న జిల్లా యంత్రాంగం

ఐదురోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌

వైద్యసేవలు మినహా అన్నీ మూసివేత

ప్రకటించిన కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ

సాక్షి, నిర్మల్‌ : జిల్లాలో కరోనా కోరలు చాస్తూ పోతోంది. మరో ఐదుగురికి పాజిటివ్‌ ఉన్నట్లు గురువారం నిర్ధారణ అయింది. జిల్లాలో 24గంటల వ్యవధిలోనే 11మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలటం కలవరపెడుతోంది. ఇందులో ఇదివరకే పాజిటివ్‌ వచ్చిన వారితో కలసిన ప్రాథమిక సంబంధీకులు కూడా ఉండటం కలకలం రేపుతోంది. కరోనా రెండో దశకు చేరుకోవడం, మొత్తం 15 పాజిటివ్‌ కేసులు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం మరింత సీరియస్‌గా తీసుకుంది. మళ్లీ ఐదు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ప్రకటించారు. జిల్లాలో గురువారం సాయంత్రం 7గంటల నుంచి ఈ నెల 14వరకు వంద శాతం కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. (ప్రపంచాన్ని వణికించిన 100 రోజులు )

మరో ఐదుగురికి..
జిల్లాలో వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. బుధవారమే ఆరుగురికి పాజిటివ్‌ రాగా, గురువారం మరో ఐదుగురికి కరోనా ఉన్నట్లు తేలడం మరింత కలవరపెడుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ, ఎస్పీ శశిధర్‌ రాజు వివరాలను వెల్లడించారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో నిర్మల్‌కు చెందిన ఒకరికి, భైంసాలో ఇద్దరికి, నర్సాపూర్‌(జి) మండలం చాక్‌పల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు ప్రకటించారు. ఇందులో ఒకరు కడెం మండలానికి చెందిన వారు కాగా, ఆయన నర్సాపూర్‌ మండలం చాక్‌పల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన రక్త నమూనాలను హైదరాబాద్‌ పంపించామని పేర్కొన్నారు.   ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో ప్రాథమిక సంబంధం కలిగిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు.  జిల్లాలో వైరస్‌ రెండో దశకు చేరుకోవడంతో ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 15 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని, వీరందరిని వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించామని తెలిపారు. వీరితో ప్రాథమిక సంబంధం కలిగి ఉన్న కుటుంబ సభ్యులు మిగతా వారందరిని జిల్లాకేంద్రంలోని మూడు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామన్నారు. 

వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో 11 కంటోన్మెంట్‌ జోన్లను గుర్తించామని, వాటి చుట్టూ అర కిలోమీటర్‌ పరిధిలో పూర్తిగా లాక్‌డౌన్‌ చేశామన్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన వారి ఇంటి నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న 30 వేల గృహాలను గుర్తించి, ఇప్పటివరకు 20 వేల ఇళ్లకు వెళ్లి వైద్య సర్వే చేశామన్నారు. నిర్మల్‌ పట్టణంలో 105, భైంసా పట్టణంలో 42, గ్రామాల్లో ఐదు వైద్య బృందాలు ఇంటింటా సర్వే చేస్తున్నాయని తెలిపారు. ఈ బృందాలు ప్రతీ ఇంటికి వెళ్లి జ్వరం, దగ్గు, ఫ్లూ లక్షణాలున్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని మెడికల్‌ (ఫార్మసీ)షాపులలో కరోనా లక్షణాలు ఉన్న వారు మందుల కోసం వస్తే వారి పేరు, ఫోన్‌ నెంబర్‌ తీసుకొని నివేదిక పంపాలని ఆదేశించామన్నారు.

ఐదు రోజులు అన్నీ బంద్‌..
కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు మళ్లీ ఐదు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఈ నెల 14వరకు వందశాతం కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దన్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని కలెక్టర్‌ పదే పదే విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనం స్టేజ్‌–2 లో ఉన్నామని, ప్రతి ఒక్క రూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఐదు క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.  నిర్మల్‌లోని కేజీబీవీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్‌ పాఠశాల, మహిళా ప్రాంగణం క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నామన్నారు. ఐసోలేటెడ్‌ వార్డులను జిల్లా ఆసుపత్రి, భైంసా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వారిని పంపిస్తున్నాం..
విదేశాల నుంచి వచ్చిన 1100 మందిలో 45 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉంచగా అందులో నలుగురికి పాజిటివ్‌ రాగా, మిగతా వారిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించామన్నారు. ఇప్పటివరకు క్వారంటైన్‌లో ఉన్న 114లో 59 మందిని గురువారం ఇంటికి పంపించగా, మిగతా 55మందిని శుక్రవారం పంపనున్నట్లు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే 1800 4255566 లేదా 100 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని కలెక్టర్‌ సూచించారు. (మూడే ముళ్లు.. ఏడుగురే అతిథులు )

కఠినంగా అమలు..
జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గురువారం రాత్రి నుంచి 14వరకు ఐదు రోజుల పాటు పూర్తి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలన్నారు. కర్ఫ్యూ అమలుకు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్య అవసరాలకు మినహా బయటకు వస్తే ఎపిడమిక్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చిన మోటార్‌ సైకిల్, కార్లు, ఆటోలు సీజ్‌ చేసి కోర్టుకు సరెండర్‌ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఐదు రోజుల పాటు మెడికల్‌ షాపులు, ఆసుపత్రులు తప్పా.. ఏవి కూడా తెరిచి ఉంచకూడదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వెయ్యి వాహనాలను సీజ్‌ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. (అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్‌ )

► నిర్మల్‌ పట్టణం : 04(గాజుల్‌ పేట్, మొఘల్‌ పుర, గుల్జార్‌ మార్కెట్, జోహ్రానగర్‌)
►  భైంసా పట్టణం :02( మదీనా కాలనీ, పాండ్రి గల్లీ)
►  గ్రామాలు :05నర్సాపూర్‌(జి) మండలంలోని చాక్‌ పెల్లిలక్ష్మణ చంద మండలంలోని కనకాపూర్, రాచాపూర్‌ మామడ మండలంలోనిన్యూ లింగాపూర్‌ పెంబి మండలంలోని అంకెన రాయదారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top