స్విచ్ ఆన్ చేసి చనాఖా–కొరాట బరాజ్ నుంచి నీళ్లు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ నగేశ్
నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆయన మన దేశానికి ప్రధానమంత్రి
పీఎం అనుమతిస్తే ఎయిర్‌పోర్టు, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి
రాష్ట్రాభివృద్ధికి ఎవరినైనా కలుస్తా..
పొన్కల్ వద్ద గోదావరిపై సదర్మట్ బరాజ్ ప్రారంభం
ఈ ప్రాజెక్టుకు పొద్దుటూరి నర్సారెడ్డి పేరు, చనాఖా–కొరాటకు సి.రామచంద్రారెడ్డి పేరు
చనాఖా–కొరాట ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసిన సీఎం
నిర్మల్: నరేంద్ర మోదీ తనకు బంధువేమీ కాదని, తనకు చుట్టరికం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘నరేంద్ర మోదీని రేవంత్‌రెడ్డి పదేపదే కలుస్తుంటారని చాలామంది అంటున్నారు. ఆయన మన దేశానికి ప్రధానమంత్రి. ఆయన్ను కలిస్తే తప్పేంటి? ఆయన అనుమతిస్తే ఎయిర్‌పోర్టు వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లినప్పుడు మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు కూడా నా వెంట ఉంటారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా, ఎన్నిసార్లైనా కలుస్తా..’ అని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మట్ బరాజ్‌ని ఆయన ప్రారంభించారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి
‘కొమురం భీమ్, రాంజీ గోండ్ పుట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోరాటాల పురిటి గడ్డ. జల్ జంగిల్ జమీన్ పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. కానీ పదేళ్లలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది. ఒకప్పుడు ఎర్రబస్సు ఎరగని ఆదిలాబాద్ జిల్లాకు ప్రస్తుతం ఎయిర్‌బస్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత పథకాన్ని ప్రారంభించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతాం. ఆదిలాబాద్ జిల్లాలో పదివేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడ, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. నా సొంత జిల్లా పాలమూరుతో సమానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తా. చనాఖా–కొరటాకు సి.రామచంద్రారెడ్డి పేరు, సదర్మట్ బరాజ్‌కు పొద్దుటూరి నర్సారెడ్డి పేరు పెడుతున్నాం..’ అని సీఎం ప్రకటించారు.
వాళ్ల తప్పులు, అప్పులే ఉరితాడుగా మారాయి..
‘గత పాలకులు చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి ఉరితాడుగా మారాయి. అప్పటి ప్రభుత్వం పదేళ్లలో చిన్న సమస్యలను కూడా పరిష్కరించకపోవడం, పట్టించుకోకపోవడంతోనే చనాఖా–కొరట, సదర్మట్ వంటి బరాజ్‌ల పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. మా ప్రభుత్వం వచ్చాక, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయ్యాక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఫామ్‌హౌస్‌లో ఉండేటాయన శుక్రాచార్యుడిలా తెరవెనుక ఉంటే, మారీచుడు, సుబాహుల్లా బావబామ్మర్దులు అడ్డుపడుతున్నారు. హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ పేరిట గొప్ప నగరాన్ని నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. ముందుచూపుతో అభివృద్ధి చేపడుతుంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు. అనుభవంతో అభివృద్ధికి సహకరించడం చేతకాకపోతే ఫామ్‌హౌస్‌లో మౌనంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.
సౌత్ కుంభమేళా మేడారం
‘ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర.. సౌత్ కుంభమేళా లాంటిది. రూ.300 కోట్లతో నిర్మించిన అమ్మవార్ల గుడులను, చేసిన అభివృద్ధి పనులను ఈ నెల 19న ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా ఆలయ అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే బొజ్జుపటేల్ అడిగిన మేరకు రూ.22 కోట్లు మంజూరు చేశాం..’ అని సీఎం తెలిపారు.
మంచివాళ్లనే గెలిపించండి
‘రేపోమాపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మంచివాళ్లను గెలిపించుకోవాలి. మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే పది ఖర్చు పెట్టి, వందలు వెనకేసుకునే వాళ్లను కాకుండా మంచోణ్ణి, మనోణ్ణి గెలిపించుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం సర్పంచ్ స్థానాలను గెలుపొందాం. మేము పాలకులు కాదు..సేవకులం.. ప్రజల మనసులు గెలుస్తున్నాం..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
గోదావరి నీళ్లను వదులుకోం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
గోదావరి నదీ జలాల విషయంలో పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా తాము వదులుకోబోమన్నారు. పోలవరం–నల్లమలసాగర్‌ను వ్యతిరేకిస్తూ తాను, సీఎం రేవంత్‌రెడ్డి..కేంద్ర ప్రభుత్వాన్ని, ట్రిబ్యునల్‌ను కలిశామని ఉత్తమ్ వెల్లడించారు. చనాఖా–కొరాట కోసం రూ.100 కోట్లు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. దక్షిణ కశ్మీరాన్ని తలపించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి చెప్పారు. రూ.100 కోట్లతో బాసర అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, బొజ్జు పటేల్, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీలు దండె విఠల్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులను అడ్డుకున్న పోలీసులు
ఇబ్రహీంపట్నం (కోరుట్ల): సదర్మట్ ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టుకు నిరంతరం నీళ్లు వచ్చేలా చూడాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు జగిత్యాల జిల్లా రైతులు సిద్ధం అయ్యారు. అయితే పోలీసులు వారిని అనుమతించలేదు.
చనాఖా–కొరట నుంచి నీళ్లు విడుదల
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం హత్తిఘాట్‌లోని చనాఖా–కొరట పంప్‌హౌస్ వద్ద మీట నొక్కిన సీఎం రేవంత్‌రెడ్డి నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. అనంతరం కాలువలో పారుతున్న నీటికి పూజలు నిర్వహించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సుదర్శన్‌రెడ్డి, నగేష్‌తో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్Š ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


