రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

tomorrow day after tomorrow heavy rain in telangana - Sakshi

బంగాళాఖాతంలో వాయుగుండమే కారణం

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ.. వారంలో ‘ఈశాన్య’ ప్రవేశం

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు మంగళవారం నిష్క్రమించాయి. ఒకట్రెండు రోజుల్లో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా నిష్క్రమించే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 12న ‘నైరుతి’ రాష్ట్రంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. రుతుపవనాలు వాస్తవంగా సెప్టెంబర్‌ నెలాఖరుకు నిష్క్రమించాలి. అయితే అప్పుడప్పుడు అక్టోబర్‌ 15 వరకు విస్తరిస్తాయి. ఈసారి 17 వరకు కొనసాగాయి. ఈసారి నైరుతి రుతుపవనాల కారణంగా 99–100 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కానీ జూన్‌ నుంచి సెప్టెంబర్‌ చివరికి 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 49 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 41 శాతం లోటు నమోదైంది. ఆ తర్వాత ఆగస్టులో 8 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం లోటు వర్షపాతమే నమోదైంది. అక్టోబర్‌ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 17 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో సీజన్‌ మొత్తంగా సాధారణ వర్షపాతమే నమోదైనట్లు వై.కె.రెడ్డి విశ్లేషించారు. 

వారంలో ఈశాన్య రుతుపవనాలు.. 
తెలంగాణ, ఏపీలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన మరో వారంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వై.కె.రెడ్డి తెలిపారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినందున తెలంగాణలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాలపై వాయుగుండం ప్రభావం ఉంటుందన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top