సారూ.. కరెంటు కష్టాలు వినరూ.. | today transco new cmd venkatanarayana coming to district | Sakshi
Sakshi News home page

సారూ.. కరెంటు కష్టాలు వినరూ..

Aug 22 2014 2:14 AM | Updated on Sep 18 2018 8:38 PM

జిల్లాలో ట్రాన్స్‌కో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.

ఖమ్మం: జిల్లాలో ట్రాన్స్‌కో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జిల్లాకు కేటాయించిన విద్యుత్ కోటాను సరఫరా చేయడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుం దో... ఎప్పుడు పోతుందో తెలవని దుస్థితి నెల కొంది. ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ, ఇతర విద్యుత్ వస్తువుల సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఏ వస్తువు ఎటు పోతుందోననే తెలుసుకునే నిఘా లేకుండా పోయింది.

కరెంటు లైన్ల మరమ్మతు కోసం కోట్ల రూపాయలు వెచ్చించినా ఏళ్ల తరబడి పనులు సాగుతూనే ఉన్నాయి. దీనికితోడు ట్రాన్స్‌కో అధికారులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు,పెద్ద ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ.. చిరు ఉద్యోగులపై వేటువేస్తూ పిచ్చుకపై బ్ర హ్మాస్త్రాలు సంధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతనంగా నియమితులై జిల్లాకు వ స్తున్న ఎన్‌పీడీసీఎల్ వరంగల్ డివిజన్ సీఎండీ వెంకటనారాయణ ఈ విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి మెరుగైన సేవలను అందించేలా చర్యలుతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 అస్తవ్యస్తంగా విద్యుత్ సరఫరా..
 జిల్లాలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. జిల్లా కేంద్రానికి 6 గంటలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ సెంట ర్‌లకు 8 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ప్రకటించిన అధికారులు అందుకు విరుద్ధంగా తమ ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారు. వ్యవసాయానికి సైతం సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో జిల్లాలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పో తుందో తెలియని దుస్థితి నెలకొంది. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించి అధికారులు ప్రకటించిన విధంగానైనా విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 పిచ్చుకపై బ్రహ్మాస్త్రం...
 ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిం దనే విమర్శలు వస్తున్నాయి.  పై స్థాయి అధికారులు చేసిన తప్పులను కిందిస్థాయి అధికారులపై నెడుతూ వారిని బలితీసుకుంటున్నారని విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకులు పలువు రు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఒక కేంద్రంలో త ప్పు జరిగితే దాని పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా అక్రమార్కులకు వంతపాడి అమాయకులను బలి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

 ఏళ్లు గడిచినా పూర్తి కాని పనులు
 జిల్లాలో విద్యుత్ సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్మాణం, పురాతన  లైన్ల పునరుద్ధరణ మొదలైన పనుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎల్‌డబ్ల్యూఈ పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు వచ్చినా సదరు కాంట్రాక్టర్లపై చర్య తీసుకోలేదు. జిల్లాలోని పట్టణాల్లో ఉన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, అవసరమైనచోట నూతన లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏపీడీఆర్‌పీ ద్వారా నిధులు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయలేదు. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లుతోంది. ఈ పనులను వేగవంతం చేయమని చెప్పే నాధుడే లేడని పలువురు అంటున్నారు.

 లోపించిన నిఘా.. అధికారుల ఇష్టారాజ్యం
 ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ ఇతర వస్తువుల సరఫరా ఇష్టారాజ్యంగా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆరా తీయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రచారం సాగుతోంది. పైరవీ, పలుకుబడి ఉన్న ప్రాంతాలకు అధిక మొత్తంలో వస్తువులు సరఫరా చేస్తున్నారని, గిరిజనుల పేరున గిరిజనేతరులు ట్రాన్స్‌ఫార్మర్లు తీసుకుంటున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీనికితోడు రైతులు, ఇతర పారిశ్రామిక వేత్తలు తమ అవసరాల కోసం ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, ఇతర విద్యుత్ పోల్స్, లైన్ల నిర్మాణానికి సంబంధించిన వస్తువులను సొంత ఖర్చులతో కొనుగోలు చేసినా వాటిని కాంట్రాక్టర్లే కొనుగోలు చేశారని బిల్లులు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై సీఎం డీ నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement