ఉన్నా.. లేనట్లే! | Sakshi
Sakshi News home page

ఉన్నా.. లేనట్లే!

Published Sat, Mar 16 2019 2:09 PM

Thimajipet Bus Stand Is There But Not Useful - Sakshi

సాక్షి, తిమ్మాజిపేట: రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన తిమ్మాజిపేట ఆర్టీసీ బస్టాండ్‌ వృథాగా మారింది. మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.12 లక్షలతో నిర్మించిన బస్టాండ్‌ను అప్పటి ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ 2001 మేలో ప్రారంభించారు. కొంతకాలం పాటు బస్సులు బస్టాండ్‌లోకి రాకపోకలు కొనసాగించాయి. ఆ తర్వాత బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లకపోవడంతో ప్రయాణికులు సైతం బస్టాండ్‌లోకి వెళ్లడం లేదు. దీంతో రోడ్డుపైనే బస్సులు ఆపడంతో ప్రయాణికులు సైతం అక్కడే ఎక్కుతున్నారు. 

అధికారుల హడావుడి..  
గత ఏడాది ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. బస్టాండ్‌కు రంగులు వేయించి అవరణను శుభ్రం చేయించారు. నేల రోజుల పాటు బస్సులను బస్టాండ్‌లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ సిబ్బందిని సైతం నియమించి బస్సుల రాకపోకలకు సాగేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం సిబ్బందిని తొలగించడంతో బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీకి ఆదాయం గండి పడుతుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బస్సులను బస్టాండ్‌లోకి వెళ్లే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.    

ఇబ్బంది పడుతున్నాం 
బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపైనే బస్సుల కోసం నిల్చుని ఎదురుచూస్తున్నాం. వర్షాకాలంలో, వేసవి కాలంలో రోడ్డుపైనే ఉండాల్సి వస్తుంది. అధికారులు చొరవ తీసుకుని బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లే విధంగా చూడాలి. 
– కృష్ణ, కోడవత్‌ తండా 
 

Advertisement
 
Advertisement