
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 4 నుంచి 19 వరకు నిర్వహించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ జారీ చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందని వెల్లడించింది.
విద్యార్థులు మే 21 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఫీజును ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలని, రూ. 50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందు కూడా ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. మూడు లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలని తెలిపింది. మరిన్ని వివరాలు http://bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించింది.