మృగాడికి పదేళ్ల జైలు | ten years in prison to rapist | Sakshi
Sakshi News home page

మృగాడికి పదేళ్ల జైలు

Nov 29 2014 3:32 AM | Updated on Jul 28 2018 8:35 PM

అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి తగిన శాస్తి జరిగింది.

బాలికపై లైంగిక దాడి కేసులో మూడో అదనపు జిల్లా కోర్టు తీర్పు
 
వరంగల్ లీగల్ : అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి తగిన శాస్తి జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే అపకారం తలపెట్టిన మృగాడిపై న్యాయస్థానం కన్నెర్ర జేసింది. సభ్యసమాజం అసహించుకునేలా బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నేరస్తుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి ఇనగంటి కృష్ణయ్య తీర్పు ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శంభునిపేటకు చెందిన నేరస్తుడు మహమూద్ గౌస్(21) క్యాటరింగ్ వర్కర్‌గా పనిచేసేవాడు. 2012 మే 7న పని లేదని, తన ఇంట్లో ఎవరూ లేరని తినడానికి అన్నం పెట్టమని సమీపంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. వారింట్లో ముగ్గురు బాలికలు ఉన్నారు. ఇంటి యజమానురాలు ప్లేట్‌లో అన్నం పెట్టి తన రెండో కూతురైన 8 ఏళ్ల బాలికను రూమ్‌లో ఉన్న నేరస్తుడు గౌస్‌కు వద్దకు పంపించింది. ఉదయం 9.40 గంటలకు అతడు తిన్న ప్లేటు తీసుకురావడానికి సదరు బాలిక రూమ్‌కు వెళ్లగా గౌస్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దీంతో బాధితురాలు ఏడుస్తూ ఇంటికి వెళ్లగా తల్లి ఏమైందని అడగడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె అందుబాటులో ఉన్న బంధువులకు తెలిపింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. గౌస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు 21 సంవత్సరాల యువకుడైన మహ్మద్ గౌస్ ఉద్దేశపూర్వకంగానే బాలికపై బెదిరింపులకు పాల్పడి, లైంగికదాడి చేశాడని రుజువు కావడంతో జడ్జి ఇనగంటి కృష్ణయ్య శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. నేరస్తుడికి ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం లైంగిక దాడి నేరం కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా, బెదిరింపులకు పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 506 కింద 6 నెలల జైలు శిక్ష విధించారు. జరిమానా చెల్లించకుంటే మరో నెల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని, శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసును అప్పటి మిల్స్‌కాలనీ సీఐ ఎల్.రమేష్‌కుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్స్ పి.రమేష్‌బాబు, నారాయణదాసు పర్యవేక్షించారు. సాక్షులను కానిస్టేబుళ్లు రమణారెడ్డి, రమేష్ కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరఫున పీపీ వై. శ్రీరాఘవరావు వాదించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement