టీడీపీలో .. మిగిలింది  ఒక్కరే.. | Sakshi
Sakshi News home page

టీడీపీలో .. మిగిలింది  ఒక్కరే..

Published Sun, Apr 7 2019 1:00 PM

Telangana TDP Have Only One Leader In Nizamabad - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మండవ వెంకటేశ్వర్‌రావు పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఒక్కరే టీడీపీలో మిగిలిపోయారు. ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి గతంలో రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నపూర్ణమ్మ కొడుకు డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి కోసం క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆమె మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటికే బోధన్‌ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా కొనసాగిన అమర్‌నాథ్‌ బాబు ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు.

అంతకు ముందుగానే టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కూడా ఇటీవలే టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. దీంతో టీడీపీకి సంబంధించి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మలు మాత్రమే టీడీపీలో కొనసాగారు. ముందస్తు ఎన్నికల సమయంలో అన్నపూర్ణమ్మ కూడా పార్టీ మారుతారని ప్రచారం సాగింది. కానీ ఆమె ఏ పార్టీలో చేరకుండా టీడీపీలోనే ఉండిపోయారు. టీడీపీలో మిగిలిన ముఖ్యనాయకుల్లో ఇద్దరే ఉండగా మండవ వెంకటేశ్వర్‌రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో అన్నపూర్ణమ్మ ఒక్కరే టీడీపీలో మిగిలిపోయారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఒక వేళ ఆమె కూడా ఏదో ఒక పార్టీలో చేరితే ఉమ్మడి జిల్లాలో టీడీపీ దుకాణం పూర్తిగా ఖాళీ అవుతుంది. ఇప్పటికే ముందస్తు శాసనసభ ఎన్నికల్లోను, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ టీడీపీకి సంబంధించిన సైకిల్‌ గుర్తు మాయమైంది. దీనికి తోడు ఆ పార్టీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో టీడీపీ కథ ముగిసిపోయినట్లే అని చెప్పవచ్చు.

Advertisement
Advertisement