24 గంటలా? 9 గంటలా? | Telangana starts free, 24-hour power supply to farmers | Sakshi
Sakshi News home page

24 గంటలా? 9 గంటలా?

Jan 19 2018 4:07 AM | Updated on Jun 4 2019 5:16 PM

Telangana starts free, 24-hour power supply to farmers  - Sakshi

‘సార్‌.. కొత్తగూడెం సబ్‌ స్టేషన్‌ నుంచి లక్ష్మీపురం ఫీడర్‌కు విద్యుత్‌ సరఫరా చేసే లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజులుగా బ్రేక్‌డౌన్‌ అయ్యేలా చేస్తున్నారు. రోజూ సాయంత్రం బ్రేక్‌డౌన్‌ అవుతున్నట్లు లైన్‌మన్‌ తెలిపారు. వెళ్లి చూడగా 24 గంటల కరెంట్‌ వల్ల మూడు రోజులుగా బోర్లలో నీరు ఊరడం లేదని.. పాత కండక్టర్‌ ముక్కను పోల్‌కు తగిలేట్టుగా లైన్‌ మీద వేసి బ్రేక్‌డౌన్‌ అయ్యేలా చేస్తున్నారు’
– విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులకు వాట్సాప్‌లో మిర్యాలగూడ రూరల్‌ ఏఈ ఇటీవల పంపిన సందేశమిది.

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో 24 గంటల సరఫరా కొనసాగింపుపై పునఃసమీక్షించేందుకు సిద్ధమైంది. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరాపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు సర్వే నిర్వహించనున్నాయి. 24 గంటల విద్యుత్‌ కొనసాగించాలా, లేక గతంలో మాదిరి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తే సరిపోతుందా అనే అంశంపై రైతుల అభిప్రాయాన్ని తీసుకోనున్నాయి. 24 గంటల సరఫరాతో సమస్యలు ఎదురవుతున్నాయా అనే అంశంపైనా రైతుల నుంచి ఆరా తీయనున్నాయి.  

ప్రత్యేక నమూనాలో సర్వే..  
అభిప్రాయ సేకరణను పకడ్బందీగా నిర్వహించేందుకు డిస్కంలు ఓ ప్రత్యేక నమూనాలో సర్వే ఫారాన్ని సిద్ధం చేశాయి. సర్వేలో భాగం గా 24 గంటల విద్యుత్‌పై అభిప్రాయం తెలిపే రైతు పేరు, ఫోన్‌ నంబర్, పొలం సర్వే నం బర్, విస్తీర్ణం, ఏ రకం పంట తదితర వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వేలో అత్యధిక శాతం మంది రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభు త్వం ఓ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నా యి.  అసెంబ్లీ సమావేశా ల్లో కూడా 24 గంటల విద్యుత్‌ సరఫరాపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కోరాలని భావిస్తోంది.

‘రబీ’ఎండిపోయే ప్రమాదం
ఇటీవలి కాలంలో రైతులు గరిష్టంగా 600 అడుగుల లోతు వరకు బోరు బావులను తవ్వుతున్నారు. ఏళ్ల కిందటి బోర్లు 100–200 అడుగుల లోతులోనే ఉండటంతో కొత్త బోర్ల దెబ్బకి అవి ఎండిపోతున్నాయి. అధిక సామర్థ్యం ఉన్న మోటార్లతో పెద్ద రైతులు భూగర్భ జలాలను తోడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోని చిన్న రైతుల బోర్లకు నీళ్లు అందక అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే మార్చి వరకు 24 గంటల విద్యుత్‌ను కొనసాగిస్తే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రబీ పంటలు ఎండిపోతాయని రైతులు భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పలుచోట్ల భూగర్భ జలాల సమస్య ఏర్పడిందని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. 24 గంటల విద్యుత్‌ వద్దని కొన్ని చోట్ల రైతులు స్థానిక విద్యుత్‌ అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వరుసగా మూడు, నాలుగు రోజులపాటు కొన్నిచోట్ల బోర్లలో నీళ్లు ఊరడం లేదు. దీంతో రైతులు విద్యుత్‌ సరఫరా వైర్లపై కండక్టర్‌ వైరు ముక్కలు      విసిరేసి విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నారని క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు.  

ప్రతిష్టాత్మకంగా ప్రారంభం.. వ్యతిరేకత
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల విద్యుత్‌ సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్నో నెలల ముందు నుంచి ప్రభుత్వం దీనికి ఏర్పాట్లు చేసింది. రూ.24 వేల కోట్లను వెచ్చించి రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరాకు వీలుగా రాష్ట్రంలో విద్యు త్‌ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచింది. కేసీఆర్‌ సైతం ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి పలుసార్లు సమీక్షలు జరిపారు.

దీంతో ఒక్కసారిగా యావత్‌ దేశం దృష్టి రాష్ట్రంపై పడింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు లేఖ రాశారు. గుజరాత్, యూపీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల అధికారులు రాష్ట్ర అధికారులకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని భావిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం పునరాలోచన జరపాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement