
శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ కు వినతి ప్రతం అందిస్తున్న బార్ కౌన్సిల్ చైర్మన్, హైకోర్టు సాథన కమిటీ ప్రతినిధులు
హైకోర్టు విభజన కోసం చొరవ తీసుకోవాలని, అప్పటి వరకు న్యాయవ్యవస్థలో నియామకాలు చేపట్టకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సాధన కమిటీ గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది.
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన కోసం చొరవ తీసుకోవాలని, అప్పటి వరకు న్యాయవ్యవస్థలో నియామకాలు చేపట్టకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సాధన కమిటీ గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, సాధన కమిటీ అధ్యక్షుడు ఎం.సహోదర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసింది. తెలంగాణ ఏర్పడి 8 నెలలైనా ఇంకా హైకోర్టును విభజించకపోవడం తగదన్నారు.
మా ఉద్యోగాలు మాకు రావాలని, మా పాలన మాకు కావాలనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే ఉమ్మడి హైకోర్టుతో న్యాయవ్యవస్థ నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. నియామక ప్రక్రియ ఆపేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అడ్డంకి కాదని ఈ సందర్భంగా గవర్నర్ అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడిగా నియామకాలు చేపట్టడం తగదన్నారు. ఈ విషయంపై ఇద్దరు సీఎంలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు సహోదర్‌రెడ్డి తెలిపారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు హరినాథ్, అనంతసేన్‌రెడ్డి, సునీల్‌గౌడ్, జాకీర్ హుస్సేన్ జావీద్‌లతోపాటు జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులున్నారు.
అఖిలపక్షం కూడా: హైకోర్టును విభజించాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల బృందం కూడా గవర్నర్‌ను కలిసింది. తెలంగాణ, ఏపీలకు వేర్వేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉన్నా.. ఉమ్మడిగానే జూనియర్ సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేస్తున్నారని దీంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నివేదించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ప్రొ.కోదండరామ్, ఎమ్మెల్యే లక్ష్మణ్ (బీజేపీ), పెద్దిరెడ్డి (టీడీపీ), శ్రవణ్ (కాంగ్రెస్), అజీజ్‌పాష (సీపీఐ), గోవర్దన్ (న్యూడెమోక్రసీ), హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి, జగత్‌పాల్‌రెడ్డి, రాజిరెడ్డి, బద్రీరాజ్ తదితరులు ఉన్నారు.