'ఆ గలీజు పని ప్రజల మీద రుద్దే ప్రయత్నమా?' | Telangana IT minister KTR fires on AP CM chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఆ గలీజు పని ప్రజల మీద రుద్దే ప్రయత్నమా?'

Jun 27 2015 12:10 PM | Updated on Sep 3 2017 4:28 AM

'ఆ గలీజు పని ప్రజల మీద రుద్దే ప్రయత్నమా?'

'ఆ గలీజు పని ప్రజల మీద రుద్దే ప్రయత్నమా?'

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

న్యూఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అయిదు కోట్ల ఏపీ ప్రజల కోసం కాకుండా, రూ.5 కోట్ల కుంభకోణం నుంచి బయటపడటానికి పని చేస్తున్నారని ఆయన చురకలు వేశారు. కేటీఆర్ శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నిధులపై జైట్లీతో చర్చించామన్నారు.

రెండు రాష్ట్రాలు బాగుండాలని, సామరస్య పూర్వక వాతావరణం ఉండాలన్నదే తమ ఉద్దేశమని కేటీఆర్ అన్నారు. తన తప్పుడు పనులను రాష్ట్రాల మధ్య సమస్యగా చంద్రబాబు చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను చేసిన గలీజు పనిని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనే సిగ్గుమాలిన పనితో ఆంధ్రా ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని, ఓటుకు కోట్లు వ్యవహారంపై తాము ఏమీ మాట్లాడలేదన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా సెక్షన్-8 చెల్లదని రాజ్యసభలో అరుణ్ జైట్లీ అప్పుడే చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం ఇప్పుడు న్యాయపరంగా చిక్కులు కొని తెచ్చుకుంటోందని అనుకోవటం లేదన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందని కేటీఆర్ అన్నారు. వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తప్పిదానికి పాల్పడ్డారని, ఈ దేశంలో చట్టం ఎవరికీ చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement