ఈనాడు కథనం అవాస్తవం: హోంమంత్రి

Telangana Home Minister Condemn Eenadu Story on Hyderabad Police - Sakshi

సాక్షి, హైదరాబాద్: తమ పోలీసులు చాలా బాగా పని చేస్తున్నారని, ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్‌వన్‌గా నిలిచారని, నేరం జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్‌ చేస్తున్నారని చెప్పారు. ‘దొంగలతో దోస్తి’ పేరుతో ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాన్ని హోంమంత్రి ఖండించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనాడు కథనంలో వాస్తవాలు లేవని అన్నారు. రాజకీయ నాయకులు చెప్తే పోలీస్ పోస్టింగ్‌లు వస్తున్నాయనేది అవాస్తవమని, బదీలీల వ్యవహారాన్ని గమనించడానికి ఓ ప్రత్యేక విభాగం ఉందని వెల్లడించారు. ఏ అధికారి ఎలా పని చేస్తున్నారనే దానిపై నిఘా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ భద్రత పరంగా బాగుండడానికి పోలీసుల పనితీరే కారణమని, ఆధారాలు లేకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. ఏ ఆధారాలతో కథనాలు రాశారో ఈనాడు ఎడిటర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అవాస్తవ కథనం ప్రచురించిన ఈనాడు సంపాదకులు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ప్రభుత్వం తరపున వెయ్యి కోట్ల దావా వేస్తామని హెచ్చరించారు. (‘మేము బిజీగా ఉన్నాం.. వాళ్లకు పనిలేక’..)

ఈనాడుపై చట్టప్రకారం చర్యలు: సజ్జనార్‌
ఈనాడు రాసిన కథనం పోలీసులను అవమానించేలా ఉందని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. నేరాలు తగ్గే విధంగా పోలీసులు పనిచేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఇలాంటి కథనాలు రాయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారని, పోలీసు అధికారులు నిత్యం‌ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసుల వివరణ కూడా తీసుకోవాలని సూచించారు. ఏ అధికారి తప్పు చేశారని తమ దృష్టికి వచ్చినా తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు పోస్టింగ్ ఇస్తున్నామని రాయడం బాధాకరమని, ఇది పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉందన్నారు. ఈనాడుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు
‘దొంగలతో దోస్తి’ పేరుతో ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం తెలంగాణ పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపిరెడ్డి మండిపడ్డారు. పోలీస్ అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉందని చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసు వ్యవస్థ నిరంతరం శ్రమిస్తోందని, ఇలాంటి వార్తలు ప్రచురించడం వలన పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడుపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వివరణ ఇవాలి: అడిషనల్ డీజీపీ
దొంగలతో దోస్తీ కథనంలో వాస్తవం లేదని, ఈ వార్తపై ఈనాడు వివరణ ఇవాలని అడిషనల్ డీజీపీ(శాంతి భద్రతలు) జితేందర్‌ డిమాండ్‌ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్త రాయడం బాధాకరమని, వాస్తవాలు మాత్రమే ప్రచురించాలని అన్నారు. పోలీసుల పోస్టింగుల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. శాంత్రి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top