మేము బిజీగా ఉన్నాం : నిరంజన్‌రెడ్డి

Minister Niranjan Reddy Comments Over Oil Palm Cultivation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పనుల్లో తాము బిజీగా ఉన్నామని, బీజేపీ నేతలు పనిలేక విమర్శలు చేస్తున్నారని  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై ఆధారాలు చూపెట్టి మాట్లాడాలని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంది పంటను మొత్తం తామే కొనుగోలు చేస్తామని, సీఎం కార్యాలయం నుంచి  అనుమతి రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు రాబోయే రెండేళ్ల కాలంలో 18వేలకుపైగా హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు.  తెలంగాణలో ఆయిల్ పామ్ విస్తరణకు కేంద్రం అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో అవగాహన లేక తెలంగాణలో  ఎవ్వరూ ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ దూర దృష్టితో.. ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టి అధ్యయనం చేశామన్నారు.

 ‘‘కేంద్రం నుంచి వచ్చిన అధ్యయన కమిటీ రాష్ట్రంలో రెండు సార్లు పర్యటించి అనుమతి ఇచ్చింది. 45వేల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయిల్ పామ్ సాగులో ఎకరానికి ఏడాదికి 1లక్ష 20వేల నుంచి 1లక్ష 50వేల వరకు ఆదాయం వస్తుంది. ఆయిల్ పామ్‌ సాగులో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ పామ్ పంటను ప్రభుత్వం కొంటుందనే గ్యారంటీ ఉంది. మన దేశానికి 21 మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం ఉంది. ప్రతిఏటా 75 వేల కోట్లు ఖర్చు చేసి దిగుమతి చేసుకుంటున్నాము.

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖమ్మం,నల్గొండ,కొత్తగూడెం జిల్లాల్లో 50వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పథకం ద్వారా రాయితీ అందిస్తున్నాము. రాష్ట్రంలో ప్రస్తుతం పామ్ ఆయిల్ ధర టన్నుకు 12వేలు ఉంది. నేను స్వయంగా 8 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు పెట్టాను. షెడ్యూల్ కులాలు, తెగలకు 100శాతం, బీసీ, చిన్న.. సన్నకారు రైతులకు 90శాతం, ఇతరులకు 80శాతం రాయితీ ఇస్తున్నాము. ఆయిల్‌ పామ్‌ సాగును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామ’ని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top