ఆన్‌లైన్‌లో తెలంగాణ హస్తకళలు | telangana handi crafts to be sell in online soon | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో తెలంగాణ హస్తకళలు

Sep 10 2015 6:08 PM | Updated on Sep 3 2017 9:08 AM

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తెలంగాణ హస్త కళా ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు రంగం సిద్దమైంది.

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తెలంగాణ హస్త కళా ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు రంగం సిద్దమైంది. ఫిలిగ్రి, డోక్ర, నిర్మల్ కొయ్య బొమ్మలు, పెంబర్తి ఇత్తడి కళాకృతులు, పోచంపల్లి, గద్వాల చీరలు, వరంగల్ కార్పెట్లు తదితర చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ విస్తరణ ద్వారా కళాకారులకు ఉపాధి మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ 'గో కార్ట్' తో తెలంగాణ రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. సాఫ్ట్‌వేర్ రూపకల్పన, సంస్థాగత ఏర్పాట్లు పూర్తి కావడంతో మరో పక్షం రోజుల్లో ఆన్‌లైన్‌లో హస్తకళా ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మరో అంతర్జాతీయ ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ అమెజాన్ కూడా తెలంగాణ హస్త కళల ఉత్పత్తుల అమ్మకాలపై ఆసక్తి చూపుతోంది. మరో ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ ఫ్లిప్‌కార్ట్ కేవలం విక్రయాలకు పరిమితం కాకుండా కేటలాగ్స్ తయారీ, ప్యాకేజింగ్, కొరియర్ చేయడం తదితరాలపై ఉత్పత్తిదారులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకువచ్చింది.
త్వరలో నూతన షోరూంలు
అంతర్జాతీయంగా ఆన్‌లైన్ విక్రయాలతో పాటు రాష్ట్రంలో షోరూంల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం 'లేపాక్షి' గా పిలుస్తున్న హస్త కళల అభివద్ధి సంస్థకు తెలంగాణలో ఎనిమిది విక్రయ షోరూంలు ఉన్నాయి. వరంగల్ మినహా మిగతా షోరూంలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృత మయ్యాయి. ఈ షోరూంల ద్వారా ఏటా రూ.40 కోట్ల మేర హస్తకళల ఉత్పత్తుల లావాదేవీలు జరుగుతున్నాయి. కరీంనగర్, మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో త్వరలో నూతన షోరూంలు ప్రారంభం కానున్నాయి. యాదాద్రి, భద్రాచలం, హైటెక్స్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ షోరూంలు ఏర్పాటు చేయాలని హస్త కళల అభివృద్ధి సంస్థ ప్రణాళిక రూపొందించింది. అయితే సిబ్బంది కొరత మూలంగా షోరూంలకు బదులుగా ఫ్రాంఛైజీలు నెలకొల్పాలని తాజాగా నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement