జాగీరు భూములపై ఆర్డినెన్స్‌ | Sakshi
Sakshi News home page

జాగీరు భూములపై ఆర్డినెన్స్‌

Published Fri, Jun 16 2017 1:25 AM

జాగీరు భూములపై ఆర్డినెన్స్‌ - Sakshi

అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్‌
- ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ ఆర్‌ఓఆర్‌ చట్టంలో మార్పులు.. కల్తీలు, నకిలీలు, మోసాలపైనా ఉక్కుపాదం
- నిఘా, తనిఖీల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు
- అక్రమార్కులకు సహకరించే అధికారులపై వేటు
- ఇందుకోసం కొత్త చట్టాలు రూపొందిస్తాం
- అప్పటివరకు ఆర్డినెన్స్‌లు జారీచేసి అమలు చేస్తాం
- నకిలీ విత్తనాల నియంత్రణకు కొత్తగా విత్తన చట్టం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జాగీరు భూముల రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు ఆర్‌ఓఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌)  చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. జాగీరు భూములు రద్దయినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని.. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. దీనితోపాటు రాష్ట్రంలో కల్తీలు, నకిలీలు, జూదం, మోసాలపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే కొత్తగా చట్టాలు తేవాలని.. అప్పటివరకు ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని సూచించారు.

ఈ ఆర్డినెన్స్‌లపై ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. గురువారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో వివిధ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సి.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, సంతోష్‌రెడ్డి, పార్థసారథి, శాంత కుమారి, కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

కల్తీ నిరోధానికి ప్రత్యేక చట్టాలు
కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో మొదటి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తున్నామని.. అయినా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కల్తీ అవుతున్నాయని భేటీలో కేసీఆర్‌ పేర్కొన్నారు. గతేడాది కొంత మందిని పట్టుకుని పీడీ యాక్టు ప్రయోగించి జైల్లో వేశామని.. ఇప్పుడున్న పీడీ యాక్టుకు కొన్ని సవరణలు చేసి, మరింత కఠినతరం చేయాల్సి ఉందని చెప్పారు. ఆహార పదార్థాలు కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారి ఆట కట్టించేలా చట్టాలు ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ చేయలేమని, చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేమనే భయం అక్రమార్కుల్లో ఉండాలని... అందుకు తగిన విధంగా పీడీ యాక్టులో సవరణలు తేవాలని అధికారులను ఆదేశించారు.

కల్తీ నిరోధానికి ప్రత్యేక చట్టం తేవాలని, విత్తన చట్టాన్ని రూపొందించాలని చెప్పారు. ఎరువులు, విత్తనాల విషయంలో మోసాలకు పాల్పడే వారిని గుర్తించి, చర్యలు చేపట్టాలని.. వారికి సహకరించే అధికారుల పనిపట్టాలని సూచించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ‘‘ముఖ్యంగా మిర్చి, పత్తి విత్తనాల్లో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో ముఠాలున్నట్లు తేలింది. మిగతా ప్రాంతాలపైనా దృష్టి పెట్టాలి. వెంటనే టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలి. పోలీసు, వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఉండాలి..’’ అని కేసీఆర్‌ సూచించారు.

గ్యాబ్లింగ్‌ను నియంత్రించాలి..
రాష్ట్రంలో పేకాట క్లబ్బులను మూసేశామని.. అయినా పలు మార్గాల్లో, ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్‌ జరుగుతోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. దానిని పూర్తిగా నిరోధించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవని, కొత్త చట్టం తేవాల్సి ఉందని చెప్పారు. దీనిపై వెంటనే ఆర్డినెన్స్‌ తేవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇక సైబర్‌ నేరాలను అదుపు చేయడానికి కూడా కొత్త చట్టం తేవాలని... అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అమ్మే వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

వేగంగా, కఠినంగా వ్యవహరించాలి
నేరాలను అదుపు చేయడానికి, నేరస్తులను కఠినంగా శిక్షించడానికి కొత్త చట్టాలు తేవడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్డినెన్స్‌ వచ్చిన మరుసటి రోజునుంచే టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగాలన్నారు. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ కరెన్సీనోట్లు చలామణీ చేసే వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని.. అలాంటి ముఠాలను గుర్తించి వారి కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించారు. ‘నకిలీలను పూర్తిగా నియంత్రించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా? సవరణలు కావాలా? కొత్త చట్టం రూపొందించాలా?..’ అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని... అవసరమనుకుంటే వెంటనే కొత్త చట్టం తేవాలని అధికారులకు సూచించారు.

Advertisement
Advertisement