తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత డీ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత డీ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీల భేటీ ముగిసింది.
అనంతరం డీఎస్ మాట్లాడుతూ ప్రతిపక్షమే లేకండా చేయాలనే ధోరణిలో అధికార పక్షం ఉందని మండిపడ్డారు. ఓట్లు దండుకుని అధికారంలోకి రావడానికే కేసీఆర్ ఎన్నికల హామీలు ఇచ్చారే తప్ప, వాటిని అమలు చేయాలనే చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. కౌన్సిల్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని డీఎస్ తెలిపారు.