టీఆర్ఎస్ తొలి బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ తొలి బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉదయం అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే...సాయంత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన అన్నారు. తమది భారీ బడ్జెట్ అంటున్న కేసీఆర్ రైతు రుణాలు పూర్తిగా ఎందుకు మాఫీ చేయలేకపోయారని పొన్నాల సూటిగా ప్రశ్నించారు.
కేంద్రం నుంచి కరెంటు పొందలేకపోతున్న కేసీఆర్... 22వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ఎలా పొందుతారని ఆయన అన్నారు. నిధుల సమీకరణపై బడ్జెట్లో స్పష్టత లోపించిందని పొన్నాల అభిప్రాయపడ్డారు. విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులకు కూడా పొంతన లేదని, బడ్జెట్లో ఇచ్చిన హామీల మేరకు పథకాలకు నిధులు ఇవ్వగలరో లేదో కేసీఆర్ తన గుండెలపై చేయి వేసుకుని ప్రజలకు జవాబు చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు.