పోటీలో లేను..! 

TDP Leader L Ramana will Not Compete On Elections - Sakshi

స్పష్టత ఇచ్చిన టీ టీడీపీ అధ్యక్షుడు రమణ 

బరిలో లేనంటూ ప్రకటించిన సీనియర్‌ నేత

మహాకూటమిలో మరింత ‘కీ’లకం

రాష్ట్రవ్యాప్తంగా 60 నియోజకవర్గాల్లో ప్రచారం

24ఏళ్ల రాజకీయంలో తొలిసారిగా పోటీకి దూరం

నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్లు

సాక్షి, జగిత్యాల : ఊహించినట్టే జరిగింది. జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు.. టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో లేరని తేలిపోయింది. ఎన్నికల్లో తాను ఎక్కడ్నుంచి బరిలో దిగాలో మహాకూటమే నిర్ణయిస్తుందని.. ఆ నిర్ణయం మేరకే పోటీలో ఉంటానని నిన్నటివరకు చెప్పిన రమణ.. తాను రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమణ తన పోటీ విషయంపై మీడియా ముందు నోరువిప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. తాను పోటీ చేయడం కంటే కూటమి గెలుపుపైనే దృష్టిపెట్టానని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని వివరించారు. దీంతో రమణ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారు..? అసలు పోటీలో ఉంటారా..? లేదా..? అనే చర్చకు తెరపడింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. తమ నాయకుడు బరిలో ఉంటారని ఇన్నాళ్లూ ఆయన ప్రకటన కోసం ఎదురుచూసిన తమ్ముళ్లు మాత్రం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిన్నటివరకు రమణ కోరుట్ల నుంచి పోటీ చేస్తారని భావించిన పార్టీ శ్రేణులు ఆయన పోటీలో ఉండరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోపక్క.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న రమణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండేదని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

‘కూటమి’లో మరింత కీలకం
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితితో ఏర్పాటైన మహాకూటమిలో కీలకంగా ఉన్న ఎల్‌.రమణ ఇకపై మరింత ప్రధాన పాత్ర పోషించనున్నారు. కూటమిలోని అన్ని పార్టీల సీనియర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తాను రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతున్నట్లు ఆయన ‘సాక్షి’కి వివరించారు. 60 అసెంబ్లీ స్థానాలకూ తగ్గకుండా పర్యటించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వాస్తవంగా కోరుట్ల నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆకాంక్షించారన్నారు. కానీ ఎన్నికల్లో పోటీలో నిలబడితే కేవలం ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావల్సి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ.. కూటమి అభ్యర్థుల కోసం శక్తివంచనా లేకుండా కృషి చేస్తానన్నారు. ఇదే క్రమంలో జగిత్యాల కూటమి అభ్యర్ధి జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. 

24 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
మహాకూటమి ఏర్పాటు పుణ్యమా అని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ 24 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తొలిసారిగా ఎన్నికల పోటీకీ దూరమయ్యారు. 1994 నుంచి 2014 వరకు అసెంబ్లీ (1996లో కరీంనగర్‌ లోక్‌సభ) ఎన్నికల్లో వరుసగా పోటీ చేశారు. ఇందులో భాగంగా తొలిసారిగా 1994 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై పోటీ చేసి 45,610 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడీ చొక్కారావుపై 51,761 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జీవన్‌రెడ్డిపై పోటీ చేసిన రమణ 48,574 ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి జీవన్‌రెడ్డి చేతిలో 55,678 ఓట్లతో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి జీవన్‌రెడ్డిపై 43,415 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి 8,600 ఓట్ల తేడాతో జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. కాగా.. 1996లో కరీంనగర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడి చొక్కారావుపై 51,761 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top