తెలుగు తమ్ముళ్ల బేజారు

TDP Activists Serious On High Command In Medak - Sakshi

సాక్షి, మెదక్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి రాజకీయంగా బలపడదామనుకున్న తమ ఆశలను పార్టీ అధినేతే గండి కొట్టడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరుతో టీడీపీ నాయకులు లోలోన రగిలిపోతున్నారు. మహాకూటమి పేరుతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు టికెట్లు కట్టబెడతారన్న వస్తున్న సమాచారాన్ని పలువురు టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాలు గతంలో టీడీపీ కంచుకోటల్లా ఉండేవి. రెండు చోట్లా టీడీపీ బలంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం జిల్లాలో టీడీపీ క్రమంగా పట్టుకోల్పోతూ వస్తోంది.

టీడీపీలోని నాయకులు ఇటీవల టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు వెళ్లారు. పార్టీపై అభిమానంతో పలువురు నాయకులు ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. మెదక్‌ నియోజకవర్గంకు సంబంధించి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎ.కె.గంగాధర్‌రావు,  తెలుగు యువత అధ్యక్షుడు బొజ్జ పవన్, టీడీపీ నేత అఫ్జల్‌ లాంటి తదితర నేతలు పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. టికెట్‌ ఇస్తే పోటీచేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే టీడీపీ మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో జత కట్టడంతో ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న ముగ్గురి ఆశలు అడియాసలయ్యాయి. పార్టీ కేడర్‌లోనూ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

పార్టీ మార్పుపై ఒత్తిడి..
కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేమని పలువురు మండలపార్టీ నాయకులు, కార్యకర్తలు అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయటం ఇష్టంలేని టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా మహాకూటమిలోని విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ నేతలను ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తోంది. తమ పార్టీలో చేరాలంటూ టీఆర్‌ఎస్‌ రాష్ట్రస్థాయి నాయకుడు ఒకరు ఏ.కె.గంగాధర్‌రావుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చిన్నశంకరంపేట, పాపన్నపేట, మెదక్‌ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులతోనూ టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

మెదక్‌ మండలంలోని పలువురు టీడీపీ కార్యకర్తలు ఇటీవల పార్టీ వీడి టీఆర్‌ఎస్‌లో చేరుదామని మండల పార్టీ అధ్యక్షుడిపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీలో ముఖ్యనేతగా పనిచేసిన సరాఫ్‌ యాదగిరి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. టీడీపీలో తనకు సన్నిహితులైన నాయకులు, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  నర్సాపూర్‌ నియోజకవర్గంలో టీడీపీ పార్టీని నడిపించే నాయకుడు లేకపోవటంతో అక్కడి మండల నాయకులు, కార్యకర్తలు సైతం పక్కపార్టీల వైపు చూస్తున్నారు. కాగా వలసల విషయమై టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏ.కె.గంగాధర్‌రావు వద్ద ప్రస్తావించగా తనతో సహా టీడీపీ నాయకులు ఎవ్వరూ పార్టీ వీడే యోచనలో లేరని తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాలకు అనుగుణంగా మహాకూటమి గెలుపుకోసం ప్రయత్నిస్తామని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top