
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఎంపికవడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని, యువ నేతకు తమ సహాయ సహకారాలు ఉంటాయని టీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సీనియర్ నేతలు తలసాని, దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 10 గంటలకు బసవతారకం రౌండ్ టేబుల్ స్కూల్ నుంచి తెలంగాణ భవన్‌కు కార్యకర్తల ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి 11.55కి తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వారు వెల్లడించారు.