ప్రాదేశికంపై కాంగ్రెస్‌ కసరత్తు | T Congress Party Leaders Focus On ZPTC Elections | Sakshi
Sakshi News home page

ప్రాదేశికంపై కాంగ్రెస్‌ కసరత్తు

Apr 17 2019 9:48 AM | Updated on Apr 17 2019 9:48 AM

T Congress Party Leaders Focus On ZPTC Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్‌ ఎన్నికలతోనైనా పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేతలు తమ మధ్యనున్న విభేదాలను వీడి పార్టీని విజయ తీరాలవైపు నడిపించేందుకు గల అవకాశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన జీవన్‌రెడ్డిని గెలిపించిన రీతిలోనే గ్రామాలు, మండలాల్లో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలను గెలిపించి కాంగ్రెస్‌ బలం తగ్గలేదని నిరూపించాలని నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే సన్నాహక సమావేశాలను ప్రారంభించిన పార్టీ నేతలు టికెట్ల కేటాయింపు నుంచి అభ్యర్థులను గెలిపించుకునేంత వరకు పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు.

బుధవారం హైదరాబాద్‌లో జరిగే పార్టీ సమావేశం తరువాత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కరీంనగర్‌ లోక్‌సభకు పోటీ చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీలలో గల 38 మండలాల్లో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలను పూర్తి చేశారు. సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లా పరిషత్‌లను ౖMðవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా బాధ్యతలను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు పార్టీ అప్పగించింది. జగిత్యాల జిల్లాను జీవన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

స్థానికంగానే అభ్యర్థుల ఎంపిక
ప్రతీ మండలానికి ఐదుగురు నాయకులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలోనే జెడ్‌పీటీసీ అభ్యర్థిని ఎంపిక చేసి పీసీసీకి పంపించాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికలో ఎక్కడైనా వివాదం ఉంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ సమస్యను పరిష్కరించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. జెడ్‌పీటీసీతోపాటు ఎంపీపీ అభ్యర్థిని కూడా ముందే ప్రకటించాలని, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ల పేర్లను కూడా ముందుగానే జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. అభ్యర్థిని ప్రకటించిన తరువాత ‘గెలిచినా పార్టీ మారబోం’ అని అఫిడవిట్‌ సమర్పించేలా పొన్నం నాయకులకు వివరిస్తున్నారు. కరీంనగర్‌ పార్లమెంటుకు సంబంధించిన ఈ ప్రక్రియ పూర్తిగా ఆయన నేతృత్వంలోనే జరుగుతోంది.

జగిత్యాల జిల్లా జీవన్‌రెడ్డికి ప్రతిష్టాత్మకం
నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలలో మెజారిటీ జెడ్‌పీటీసీలను కైవసం చేసుకొని జగిత్యాల జిల్లా పరిషత్‌పై జెండా ఎగరేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి ప్రతీకారంగా మెజారిటీ జెడ్‌పీటీసీలు, ఎంపీపీలను గెలిపించుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు.

ఈ మేరకు మండలాల వారీగా ఆశావహులైన సీనియర్‌ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించిన రీతిలోనే గ్రామాలు, మండలాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఇక్కడ జిల్లా పరిషత్‌ ౖచైర్‌పర్సన్‌ అభ్యర్థి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత కరీంనగర్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమను బరిలోకి దింపే అవకాశాలు ఉండడంతో ఆ స్థాయి నాయకురాలిని నిలబెట్టాలని యోచిస్తున్నారు.

ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి బాధ్యతలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పెద్దపల్లి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో తన చేతిలో ఓడిపోయిన పుట్ట మధును టీఆర్‌ఎస్‌ జెడ్‌పీ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బలమైన నేతను కమాన్‌పూర్‌ నుంచి బరిలోకి దింపే యోచనతో ఉన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సిహెచ్‌.విజయరమణారావు, రామగుండంలో రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌లతో కలిసి పెద్దపల్లి జిల్లా పరిషత్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని యోచిస్తున్నారు. స్థానికంగా అభ్యర్థుల ఎంపిక నుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని, పార్టీ ఫిరాయించే అవకాశం ఉన్న వారిని దూరంగా ఉంచాలని కూడా శ్రీధర్‌బాబు భావిస్తున్నట్లు తెలిసింది. జెడ్‌పీటీసీలతో ఎంపీటీసీలను మెజారిటీ సంఖ్యలో గెలిపిస్తే ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవచ్చనే యోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement