మళ్లీ ‘స్వైన్’ టెన్షన్

మళ్లీ ‘స్వైన్’ టెన్షన్ - Sakshi


 రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్న స్వైన్‌ఫ్లూ...జిల్లా ప్రజలను సైతం వణికిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. మహానగరానికి జిల్లా ఆనుకుని ఉండటంతో ఇక్కడి నుంచి నిత్యం వందలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.ఈ వ్యాధితో ఆయా జిల్లాలో మృతిచెందుతున్న సంఘటనలు కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయి.       -నల్లగొండ

 

 ఐదేళ్ల క్రితం జిల్లాను వణికించిన ఈ మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. 2010లో జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు 25 నమోదయ్యాయి. ఈ వ్యాధి భారిన పడిన వారిలో అప్పటి కలెక్టర్ ఎస్‌ఏఎం రిజ్వీ కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు మళ్లీ వ్యాధి ఆనవాళ్లు జిల్లాలో కనిపించాయి. 2012లో మరో 8 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అప్పట్లో వ్యాధి లక్షణాలను గుర్తించిన వైద్యులు రోగుల నుంచి తేమడ సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీ మెడిసిన్ సెంటర్‌కు పంపారు. పరీక్షల అనంతరం రోగుల్లో స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం గాంధీ, ఉస్మానియా, చాతి ఆస్పత్రుల్లో ప్రత్యేక చికిత్స చేయించారు. దీంతో వ్యాధి ఆరంభదశలోనే నివారణ చర్యలు చేపట్టడంతో ఎలాంటి మరణాలు న మోదు కాలేదు.

 

 అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

 మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ స్వైన్‌విహారం చేస్తుడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం వ్యాధి నివారణకు జిల్లాకు నోడల్ అధికారిని నియమించింది. కలెక్టర్ గురువారం వైద్యాధికారులు, సంక్షేమ శాఖల అధికారులు, ప్రైవేటు వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందికి హెచ్1ఎన్1 వ్యాక్సిన్లు పంపిణీ చే సింది. దీంతో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేకంగా పది పడకలను ఏర్పాటు చేసింది. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ ఆమోస్ తె లిపారు.

 

 ఒకరి నుంచి మరొకరికి...

 చలికాలంలో జలుబు వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్వైన్‌ఫ్లూ కూడా ఇదే తరహాలో వ్యాపి చెందుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమిస్తుంది. బాధిత రోగి తగు జాగ్రత్తలు పాటించకపోతే ఎదుటివారికి సంక్రమించే ప్రమాదం ఉంది. దగ్గు, తుమ్ము వస్తే...తుంపర్లు ఎదుటి వారిపై పడకుండా చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతులపై తుంపర్లు పడితే  శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్లూ సోకిన వారి నుంచి ప్రజలు దూరంగా ఉండాలి.

 

 విద్యార్థులను అప్రమత్తంగా ఉంచండి : డీఈఓ

 నల్లగొండ అర్బన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను అప్రమత్తంగా ఉంచాలని డీఈఓ ఎస్. విశ్వనాథరావు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించిన విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులకు, స్థానిక వైద్యాధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ లక్షణాలు కనిపిస్తే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

 వ్యాధి లక్షణాలు...

 వ్యాధి సోకిన వ్యక్తికి ఇది ఫ్లూ జ్వరంలాగానే కనిపిస్తుంది. వ్యాధి సోకిన వారికి తీవ్ర జ్వరం, జలుబు (ముక్కు నుంచి నీరు కారడం), గొంతులో ఇన్‌ఫెక్షన్, తలనొప్పి, శరీర నొప్పులు, దగ్గు, నీరసం, అలసటతో బాధపడతారు. వాంతులు, విరేచనాలు అయినప్పుడు స్వైన్‌ఫ్లూ గా అనుమానిస్తున్నారు. సాధారణంగా జ్వరం మూడు నుంచి వారం రోజులు వరకు ఉంటుంది. కానీ స్వైన్‌ఫ్లూ రోగికి ఎక్కువ రోజులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో చిన్నపిల్లలో ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. శ్వాసతీసుకోవడం, చర్మం నీలిరంగుగా మారడం, నీళ్లు, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, త్వరగా నిద్ర లేవలేకపోవడం, జ్వరం తగ్గినా దగ్గు తగ్గదు. పెద్దల్లో ఆయా సం, చాతి, పొట్టలో నొక్కేస్తున్నట్లు  నొప్పి, వాంతులు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో ఉండి వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు వెలుగులోకి వచ్చే వీలుంటుంది. వీరు మరింత జాగ్రత్తలు తీసుకోవడం మంచింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top