
సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్ భూముల వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మియాపూర్ భూకుంభకోణంపై తుది విచారణను జనవరి 30న చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
మియాపూర్ భూములు ఎక్కడికీ పోలేదని, ఎలాంటి భూకుంభకోణమూ జరగలేదని సీఎం కేసీఆరే ప్రకటన చేశారని అందువల్ల ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని వాదించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, పాల్వాయి వెంకట్‌రెడ్డి వాదిస్తూ ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతిలో ఉందని ధర్మాసనానికి వివరించారు. దీంతో కేసును లోతుగా విచారించాల్సి ఉన్నందున ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసును మరో సివిల్ కేసుకు జతచేసి విచారించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.