గిరిజనుల రిజర్వేషన్‌ వివాదంలో సుప్రీం నోటీసులు    | Supreme Court Issue Notice On Reservation Of Tribals Controversy | Sakshi
Sakshi News home page

Jul 31 2018 3:16 AM | Updated on Sep 2 2018 5:18 PM

Supreme Court Issue Notice On Reservation Of Tribals Controversy - Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ : గిరిజనుల రిజర్వేషన్‌ వివాదంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో సుప్రీంకోర్టు సోమవారం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వుల సవరణ చట్టం–1976 మేరకు బంజారా, లంబాడా, సుగాలీలను ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్‌ 342ని ఉల్లంఘించడమేనని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ తొలుత హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే ఈ వివాద పరిష్కారం న్యాయస్థానం పరిధిలో లేదని, పార్లమెంటరీ వ్యవస్థ పరిధిలో ఉందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ గోండ్వానా వెల్ఫేర్‌ సొసైటీ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్‌తో పాటు మరికొన్ని పిటిషన్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు ఎం. ఎన్‌.రావు, వికాస్‌ సింగ్, అల్లంకి రమేశ్‌ వాదనలు వినిపించారు. బంజారా, లంబాడాలు, సుగాలీ లు గిరిజనులు కాదని, 1976 వరకు పాత ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాల్లో వారిని ఎస్టీలుగా పరిగణించలేదని, ఇతర రాష్ట్రాల నుంచి వారు తెలంగాణకు వలస వచ్చి అక్కడి అసలైన గిరిజనులకు ఉద్దేశించిన హక్కులను కొల్లగొట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకుముందు వారు బీసీ జాబితాలో ఉన్నారని వివరించారు.  హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఆంధ్రా ప్రాంతంలో ఎస్టీలుగా గుర్తించారని, కానీ హైదరాబాద్‌ స్టేట్‌లో కాదని పిటిషనర్ల తరఫు లాయర్లు వివరించారు. బంజారా సేవా సమితి తరఫున సీనియర్‌ న్యాయవాదులు రాజీవ్‌ధావన్, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి తమ వాద నలు వినిపిస్తూ.. పిటిషనర్లు 42 ఏళ్ల అనంతరం ఈ అంశంపై కోర్టును ఆశ్రయించారని, పిటిషన్‌ను తోసిపుచ్చాలని విన్నవించారు. వాదనల అనంతరం పిటిషన్‌పై స్పందించాలంటూ ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ,ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. అనంతరం విచారణ వాయిదా వేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement