సింగరేణిలో పెరిగిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు

Super Specialty Hospitals increased in Singareni - Sakshi

42 నుంచి 72కు పెంచినట్లు వెల్లడించిన సీఎండీ శ్రీధర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందించే ఆస్పత్రుల సంఖ్యను 42 నుంచి 72కు పెంచినట్లు సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు సింగరేణి ప్రాంత జిల్లా కేంద్రాల్లోని ప్రముఖ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కార్మికులు వైద్య సేవలు పొందవచ్చన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలతో బుధవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి పలు హామీలిచ్చారు.

వైద్య సదుపాయాల మెరుగుదలకు రూ.10 కోట్ల వ్యయంతో ఆధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేశామని, ఏరియా ఆస్పత్రులన్నింటినీ ఆధునీకరించి ఏసీ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ఆదివారం హైదరాబాద్‌కు చెందిన సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల బృందాలతో 6 ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కారుణ్య నియామకాల పథకం కింద వైద్య కారణాలతో విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న 450 మంది కార్మికుల స్థానంలో వారి కుటుం బీకులకు అవకాశమిచ్చామన్నారు.

ఈ ఏడాది కంపెనీకి అత్యధిక లాభాలు అర్జించిన నేపథ్యంలో కార్మికులకు లాభాల్లో గణనీయ వాటా లభించే అవకాశముందన్నారు. సంస్థలో ఉత్పత్తి కన్నా రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో సింగరేణికి నవరత్న కంపెనీ హోదా తప్పక లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో గుర్తింపు సంఘం నాయకులు వెంకట్రావు, ఎం.రాజిరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top