‘ఫీజు’ బకాయిలు రూ. 361 కోట్లు 

Students worry about Delay in the release of fee reimbursement - Sakshi

ఇంకా పూర్తికాని 2017–18 సంవత్సర చెల్లింపులు

పెండింగ్‌ కేటగిరీలో ఎక్కువగా బీసీల ఫీజులే

2018–19 దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలోనే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ నిధుల విడుదలలో నెలకొన్న జాప్యం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తాయేమోనన్న భయం వారిలో నెలకొంది. వాస్తవానికి విద్యాఏడాది ముగిసే నాటికి ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు సంతృప్తికర స్థాయిలో నిధులిచ్చిన ప్రభుత్వం... బీసీ సంక్షేమ శాఖకు మాత్రం అంతంతమాత్రంగానే నిధులు విడుదల చేసింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులున్న ఆ శాఖలో ఇప్పుడు బకాయిలు భారీగా పేరుకుపోయాయి.  

రెండొంతులు బీసీలవే... 
2017–18 విద్యా ఏడాదికి సంబంధించి ఇంకా రూ. 361 కోట్ల మేర ఫీజులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇందులో బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన బకాయిలే రూ. 220 కోట్లు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వార్షిక సంవత్సరం ముగుస్తుండటంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు తమ వద్ద అందుబాటులో ఉన్న నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తున్నప్పటికీ బీసీ సంక్షేమశాఖ వద్ద మాత్రం నిధులు నిండుకోవడంతో చేతులెత్తేసింది.  ఎన్నికల కోడ్‌ రావడంతో నిధుల విడుదలలోనూ జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది విద్యార్థులకు సమస్యలు తప్పవనిపిస్తోంది. ప్రస్తుత వార్షిక సంవత్సరం నుంచి నెలవారీగా నిధులు విడుదల చేసినప్పటికీ సీలింగ్‌ ప్రకారం వెళ్లడంతో తక్కువగా నిధులు వచ్చాయి. దీంతో రూ. 361 కోట్ల మేర బకాయిలు మిగిలిపో యాయి. ప్రభుత్వం అదన పు నిధులు కేటాయిస్తే సమ స్యకు పరిష్కారం దొరుకుతుందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

పరిశీలనలోనే దరఖాస్తులు... 
2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి నెలాఖరుతో ముగిసింది. దాదాపు 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. స్వీకరణ ప్రక్రియ సుదీర్ఘకాలంపాటు సాగడంతో వాటి పరిశీలన సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు కేవలం 14% దరఖాస్తులనే పరిశీలించారు. మిగతా వాటిని వేగంగా పరిశీలించి అర్హతను నిర్ధారించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యల్లో వేగం పెంచారు. ఈసారి వచ్చిన దరఖాసులను ప్రాథమికంగా అంచనా వేసిన సంక్షేమాధికారులు... ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల చెల్లింపులకు రూ. 2,250 కోట్లు అవసరమని భావిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తున్న క్రమంలో ప్రాధాన్యతల ప్రకారం ఫీజులివ్వలని సంక్షేమాధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసే నిధుల ప్రకారం మంజూరు చేసేలా సంక్షేమ శాఖలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top