విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ వర్తింపా?

Students object to Neat clause - Sakshi

     నీట్‌ నిబంధనపై విద్యార్థుల అభ్యంతరం

     దేశీయ పరీక్షను విదేశాల్లోనూ వర్తింపజేయడం ఏమిటని వాదన

     దీనిపై కేంద్రం, ఎంసీఐకి పలువురు విద్యార్థుల ఫిర్యాదు

     ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో వైద్య విద్య చదివే విద్యార్థులు సైతం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)లో ఉతీర్ణత సాధించాలనే నిబంధన వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. 2018 మే తర్వాత విదేశాల్లో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించే వారు కచ్చితంగా నీట్‌ అర్హత సాధించాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇటీవల నిర్ణయించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి మన దేశంలో ప్రాక్టీస్‌ చేయాలనుకునే వారు ఎంసీఐ నిర్వహించే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ) ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పేరును ఎంసీఐ తాజాగా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్ట్స్‌)గా మార్చింది. 2018లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసే ప్రతి విద్యార్థీ కచ్చితంగా నెక్ట్స్‌ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దేశ, విదేశాల్లో ఎక్కడ ఎంబీబీఎస్‌ పూర్తి చేసినా నెక్ట్స్‌ ఉత్తీర్ణత సాధిస్తేనే మెడికల్‌ ప్రాక్టిస్‌ చేసే అర్హత ఉంటుంది. ప్రస్తుత ఎఫ్‌ఎంజీఈ కంటే మరింత పకడ్బందీగా నెక్ట్స్‌ నిర్వహించేందుకు ఎంసీఐ ఏర్పాట్లు చేసింది.

ఇలాంటి తరుణంలో విదేశాలకు వెళ్లే వారికి ముందుగానే నీట్‌ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వర్తింపజేయడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. విదేశాలలోనే ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, అక్కడే స్థిరపడాలనుకునే వారు ‘నీట్‌’లో అర్హత సాధించడం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే ‘నీట్‌’అనేది మన దేశానికి సంబంధించిన పరీక్ష అని, ఇతర దేశాలకు దీన్ని వర్తింపజేయడం తగదని అంటున్నారు. ఈ అంశంపై పలువురు విద్యార్థులు ఇప్పటికే ఎంసీఐకి ఫిర్యాదు చేశారు. దేశంలో వైద్యం చేయాలంటే నెక్ట్స్‌ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉన్నప్పుడు మళ్లీ ‘నీట్‌’ఎందుకనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలోని 18 వేల మంది విద్యార్థులు ఏటా రష్యా, చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్‌లలో ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్తున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి ఏటా 3 వేల మంది విదేశాల్లో ఎంబీబీఎస్‌ కోర్సు చదివేందుకు వెళ్తున్నారు. దేశంలో ఎంబీబీఎస్‌ కోర్సు ఐదేళ్లు ఉండగా చైనాలో ఆరేళ్లు, ఫిలిప్పీన్స్‌లో నాలుగున్నరేళ్లు ఉంది. అయితే ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరాలంటే అక్కడ ప్రీ మెడికల్‌ కోర్సు పూర్తి చేయాలి. ఈ కోర్సు ఏడాదిన్నర ఉంటుంది. గతేడాది ఫిలిప్పీన్స్‌లో ప్రీ మెడికల్‌ కోర్సులో చేరిన వారు ఈ ఏడాది మే తర్వాత ఎంబీబీఎస్‌లో చేరతారు. తాజా నిబంధన ప్రకారం వీరు కూడా నీట్‌ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. గతేడాది వెళ్లిన వారు సైతం ఇప్పుడు నీట్‌ రాయాలనే అంశంపై పలువురు తెలుగు విద్యార్థులు ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా, ఎంసీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై పిటిషన్‌ వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top