ఒడలు బళ్లు.. బళ్లు ఓడలు!

Students Not Interested For Technical Courses - Sakshi

ఏటా సాంకేతిక విద్యలో తగ్గిపోతున్న ప్రవేశాలు

సంప్రదాయ డిగ్రీల్లో పెరుగుతున్న వైనం

లెక్కలు తేల్చిన ఉన్నత విద్యా శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాంకేతిక విద్యా కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. నాణ్యత ప్రమాణాలు కొరవడటంతో ఆయా కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌ వంటి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు సంప్రదాయ డిగ్రీలైన బీకాం, బీఎస్సీలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సైన్సు, కామర్స్‌ రంగాల్లో అవకాశాలు పెరుగుతుండటంతో వీటిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో 6 వేల వరకు తగ్గిపోగా, సంప్రదాయ డిగ్రీల్లో చేరిన వారి సంఖ్య గత ఏడాదికి, ఇప్పటికి 25 వేలకు పైగా పెరగడం గమనార్హం. ఉన్నత విద్యా శాఖ తాజాగా తేల్చిన లెక్కల్లో ఈ వాస్తవం బయటపడింది.

సంప్రదాయ డిగ్రీల్లో భారీ పెరుగుదల..
రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీలైన బీఏ, బీకాం, బీఎస్సీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాదికి ఇప్పటికి పోల్చితే బీఏలో 8 వేలకు పైగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. అలాగే బీకాంలో 16 వేల వరకు పెరగగా, బీఎస్సీలో 10 వేల వరకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటాలో 2016–17 విద్యా సంవత్సరంలో 71,066 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 54,064 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరంలో 66,079 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 48,662 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ఎంబీఏ, ఎంసీఏలోనూ 2016–17లో 24,557 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 22,479 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018–19కి వచ్చే సరికి 25,912 సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 21,767 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్‌లోనూ 2016 విద్యా సంవత్సరంలో 50,721 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 36,983 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018 విద్యా సంవత్సరంలో 38,359 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 29,310 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top