ఉల్లి ‘ఘాటు’! 

A steadily rising price of onions in the state - Sakshi

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ధర

హోల్‌సేల్‌లో కిలో రూ. 33, బహిరంగ మార్కెట్‌లో రూ. 42–45

10 రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 10–15 పెరుగుదుల

మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలతో తగ్గిన దిగుబడి

గతేడాదితో పోలిస్తే 4–5 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గుదల  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉల్లి ఘాటు క్రమంగా పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాల్లో ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గడంతో ధర కొండెక్కుతోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కిలో ఉల్లి ధర రూ. 10 నుంచి రూ. 15 మేర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ. 42 నుంచి రూ. 45 పలుకుతుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉల్లి సాగు గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, కొంతమేర కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగవుతుంది. రాష్ట్రంలో సాధారణ ఉల్లి సాగు విస్తీర్ణం 13,247 హెక్టార్లు కాగా ఈ ఏడాది ఆలస్యంగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల్లో భారీ తగ్గుదల కారణంగా 5,465 హెక్లార్లలోనే సాగైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లితో పూర్తిస్థాయిలో అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.

సాధారణంగా రాష్ట్ర మార్కెట్‌లకు మహారాష్ట్రలోని షోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్, కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్‌ ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి దిగుమతులు ఉంటాయి. అలాగే ఏపీలోని కర్నూలు నుంచి కూడా ఉల్లి సరఫరా అవుతుంది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉల్లి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అక్కడ దిగుబడులు పూర్తిగా తగ్గాయి. మార్కెట్‌లోకి వస్తున్న కొద్దిపాటి ఉల్లి ఆయా రాష్ట్రాల అవసరాలకే సరిపోతుండగా మిగతా వాటి కోసం దక్షిణాది రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.

ఫలితంగా డిమాండ్‌ పెరగడంతో ధరలు  కూడా అమాంతం పెరుగుతున్నాయి. 2, 3 రోజుల కిందటి వరకు హైదరాబాద్‌ మార్కెట్‌లకు క్వింటాల్‌కు రూ. 2 వేల మేర పలికిన ధర మంగళవా రం రూ. 3 వేలకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌లకు 4–5 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గిపోయింది. దీంతో హోల్‌సేల్‌ ధరే కిలో రూ. 33కి చేరింది. మరోవైపు కర్నూలు జిల్లాలో సైతం మార్కెట్‌లోకి ఉల్లి అంతగా రావడం లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి సాగు అనుకున్నంత జరగకపోవడంతో తెలంగాణకు అవసరమైన సరఫరా లేక ధర పెరుగుతోంది. హైదరాబాద్‌ బహిరంగ మార్కెట్‌లో పది రోజుల కింద కిలో ఉల్లి రూ. 30 మేర ఉండగా ప్రస్తుతం రూ. 42 నుంచి రూ .45కి చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్‌ వర్గాలు అంటున్నాయి. 

50 వేల టన్నులు నిల్వ ఉంచిన కేంద్రం
ఇటీవలి వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగుతాయన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే 50 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్‌ ద్వారా సేకరించి నిల్వ చేసింది. వచ్చే నెలలో ఉల్లి ధరలు మరింత పెరిగిన పక్షంలో నిల్వచేసిన ఉల్లిని మార్కెట్‌లోకి అందుబాటు లోకి తెచ్చి ధరను నియంత్రిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారులశాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి వ్యాపారులు నిల్వలు పెంచకుండా చూడటం, వారిపై నియంత్రణ చర్యలు చేపడితేనే ఉల్లి ధరలకు కళ్లెంపడే అవకాశం ఉంది. లేదంటే మున్ముం దు వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top