కరెంటు బిల్లులు పెరగవ్‌! 

State govt has decided on the power charges of next year - Sakshi

వచ్చే ఏడాదిలోనూ ప్రస్తుత విద్యుత్‌ చార్జీలే నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 

ఈఆర్సీకి లేఖ రాసిన రాష్ట్ర ఇంధన శాఖ 

ఏప్రిల్‌ 1 నుంచి ప్రస్తుత చార్జీలే కొనసాగింపు 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు ఉండదు. చార్జీల పెంపు లేకుండా ప్రస్తుత టారిఫ్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరం(2019–20)లో యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా సోమవారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) కార్యదర్శికి రహస్య లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచొద్దని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ చార్జీలు యథాతథంగా ఏప్రిల్‌ 1తో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలవుతాయని ఆదేశిస్తూ త్వరలో ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. 

ఏఆర్‌ఆర్‌ లేనట్టే! :దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)ల యాజమాన్యాలు ఇప్పటి వరకు 2019–20 సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదికను ఈఆర్సీకి సమర్పించలేదు. గతేడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో వాయిదాను కోరాయి. ఏటా నవంబర్‌ చివరిలోగా రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ అంచనాలను ఆర్థిక అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌) రూపంలో విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఈఆర్సీకి సమర్పించాలని విద్యుత్‌ చట్టంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడనున్న ఆర్థిక లోటు అంచనాలు, దీన్ని అధిగమించేందుకు ఎంత మొత్తంలో చార్జీలు పెంచాలన్న అంశాన్ని ఈ నివేదికలో డిస్కంలు ప్రతిపాదించాలి. డిస్కంలు ప్రతిపాదించిన చార్జీల పెంపుపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యుత్‌ టారిఫ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏటా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి వారం రోజుల ముందే ఈఆర్సీ టారిఫ్‌ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రస్తుత విద్యుత్‌ చార్జీలను వచ్చే ఏడాది యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీని కోరిన నేపథ్యంలో డిస్కంలు ఈఆర్సీకి 2019–20కు సంబంధించిన ఏఆర్‌ఆర్‌ నివేదికను సమర్పించకపోవచ్చని ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

ఈఆర్సీ చైర్మన్‌ ఎంపిక ఎప్పుడు ? 
టీఎస్‌ఈఆర్సీ చైర్మన్‌ ఇస్మాయిల్‌ అలీ ఖాన్‌ గత జనవరి 9న పదవీ విరమణ పొందారు. అంతకుముందే సభ్యులిద్దరూ పదవీ విరమణ చేయడంతో గత రెండు నెలలుగా కమిషన్‌ ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక కమిటీ.. ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త చైర్మన్, సభ్యుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top