
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలలో మార్పులుచేర్పుల ప్రక్రియను జూన్ 25లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ నిర్వహణ సిబ్బంది వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించారు.
పోలింగ్ సిబ్బంది నియామకాన్ని పూర్తి చేసేందుకు వీలుగా.. సమగ్ర వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ పాల్గొన్నారు.