120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు 

State Election Commission Released Municipal Election Notification In Telangana - Sakshi

నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెర దించుతూ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేష న్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీచేసింది. మూడు డివిజన్లలోని ఓట్లలో దొర్లిన తప్పుల కారణంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఎన్నికల షెడ్యూల్‌ మార్చాలంటూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సాయంత్రం హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాత్రి 8.50 నిమిషాలకు ఎస్‌ఈసీ కార్యాలయంలో కమిషనర్‌ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కరీంనగర్‌ జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితా, తుది జాబితాకు వ్యత్యాసాలు ఉన్నందున ఆ కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెప్పారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వార్డుల్లో పలు కులాల ఓట్లు సరిగా లెక్కించలేదని, దాన్ని సవరిం చాలని హైకోర్టు సూచించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా 3వ వార్డుతోపాటు 24, 25 వార్డుల్లో కులాల ఓట్లు సరిగా లేవని పేర్కొందని, ఈ విషయాన్ని మున్సిపల్‌ శాఖకు తెలియజేశామని వెల్లడించారు. ఆ తప్పొప్పులను మంగళవారం అర్ధరాత్రి 12 గంటల్లోగా సవరించి ఇస్తే, దానికి కూడా కలిపి సవరణ నోటిఫికేషన్‌ ఇస్తామని నాగిరెడ్డి తెలిపారు. ఒకవేళ ఆలోగా సవరించకుంటే మరోసారి రీషెడ్యూల్‌ జారీ చేస్తామన్నారు. మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక తేదీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. కాగా, వివరాలు రానందున కరీంనగర్‌ కార్పొరేషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడంలేదని ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ మంగళవారం అర్ధరాత్రి 12.30కి ‘సాక్షి’కి తెలిపారు. 

ఒకే విడతలో.. బ్యాలెట్‌ పద్ధతిలో.. 
120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 325 డివిజన్లకు ఎన్నికలు నిర్వ హించనున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుపుతున్నట్టు నాగిరెడ్డి తెలిపారు. 14న అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించిన తర్వాత జిల్లాల్లో బ్యాలెట్‌ పత్రాలను ముద్రించడానికి ఆదేశాలిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబీర్‌పుర డివిజన్‌కూ ఈనెల 22నే ఎన్నికలు ఉంటా యని పేర్కొన్నారు. దీనికి కూడా బుధవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారని, ఈ నెల 12న అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత అదే రోజు తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఫలితాలు 25నే ప్రకటిస్తామని చెప్పారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top