సిబ్బందిలేక.. ఇబ్బంది !

Staff And Doctors Shortage in COVID 19 Centers Nalgonda - Sakshi

జిల్లాలోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో కరోనా వైద్యం కష్టమే..

నాలుగు ఆస్పత్రుల్లో 50 బెడ్లతో కోవిడ్‌ వార్డులు

చికిత్సకు సిబ్బందిని మూడు షిప్టులుగా విభజన, నాలుగు టీమ్‌ల ఏర్పాటు

ఆస్పత్రులను వేధిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కొరత

కోవిడ్‌ వైద్య సేవలు ఆలస్యమయ్యే అవకాశం

సాక్షి, యాదాద్రి : కరోనా మహమ్మారి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం కరోనా బాధితులకు స్థానికంగా ఐసోలేషన్‌వార్డుల్లో  వైద్యం అందించాలని నిర్ణయించింది. అయితే ఆయా ఆస్పత్రులు డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కరోనా చికిత్సకోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భువనగిరి, రామన్నపేట ఏరియా ఆస్పత్రి, చౌటుప్పల్, ఆలేరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. ఆయా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఉన్నప్పటికీ వైద్యం అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది మాత్రం సరిపడా అందుబాటులో లేరు. దీంతో కరోనా వైద్య సేవలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

50 బెడ్లు.. మూడు షిప్టుల్లో విధులుజిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సకోసం వైద్యశాలల్లో మొత్తం 50 బెడ్లు ఏర్పాటు చేశారు. భువనగిరిలో 20ఆలేరులో 10, రామన్నపేటలో 10, చౌటుప్పల్‌లో 10 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి ప్రతి ఆస్పత్రిలో మూడు షిప్టుల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తున్నారు. ఇందుకు ఒక్కో ఆస్పత్రిలో నాలుగు టీమ్‌లను తయారు చేస్తున్నారు. ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటలనుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఇలా షిప్టులుగా విభజించారు. ప్రతి షిఫ్ట్‌లో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ముగ్గురు వార్డు బాయ్‌లు, ఇద్దరు స్వీపర్లు ఉండాలి. అయితే రాత్రి షిప్టుకు కేటాయించిన వారు రోజువిడిచి రోజు విధులు నిర్వహిస్తారు.

ఆస్పత్రుల్లో సిబ్బంది ఇలా..
భువగనరి.. భువనగిరిలో 26 మంది డాక్టర్లకు గాను 14 మంది ఉన్నారు. 25 మంది స్టా‹ఫ్‌ నర్స్‌లకు గాను 16 మంది ఉన్నారు. వార్డు బాయ్‌లు, ఏఎన్‌ఎంల కొరత కూడా ఉంది. ఆస్పత్రికి 1000 పీపీ కిట్లు, 1000 ఎన్‌–95 మాస్క్‌లు, 10 ఆక్సిజన్‌ సిలెండర్లు, 10 బెడ్స్, 1 వెంటిలేటర్‌ వచ్చాయి. ఇంకా పల్స్‌ ఆక్స్, బెడ్స్, వెంటిలేటర్లు రావాల్సి ఉంది.
రామన్నపేట.. రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందిచేందుకు పది బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్‌వార్డును ఏర్పాటుచేశారు.  అస్పత్రిలో సివిల్‌సర్జన్‌ 3, అసిస్టెంట్‌ సివిల్‌సర్జన్‌ 12, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు 6 మొత్తం 21 మందికి గాను 8 మంది డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. స్టా‹ఫ్‌నర్సులు 14, హెడ్‌నర్సులు 2, ఏఎన్‌ఎం 3 పోస్టులకుగాను ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఐదుగురు వార్డ్‌బాయ్స్‌గాను ముగ్గురు ఉన్నారు. వీరుగాక 11మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
చౌటుప్పల్‌.. చౌట్పుపల్‌ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో మొత్తం పోస్టులు 49కి గాను 15 మంది మాత్రమే ఉండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రిలో మొత్తం 17 మంది వైద్యులకుగాను 9 మంది ఉన్నారు. స్టాఫ్, హెడ్‌నర్సులు 12మందికి ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
ఆలేరు.. ఆలేరులో 10 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. వీటీతోపాటు బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఐసోలేషన్‌ వార్డు కొనసాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top