కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మలు

srinivas yadav Fires on Congress party - Sakshi

వార్తల్లో ఉండేందుకేప్రభుత్వంపై విమర్శలు

నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మలని...టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతకాని దద్దమ్మని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డితో కలసి శ్రీనివాస్‌ యాదవ్‌ తెలంగాణభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలసి రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఉందన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

పార్టీ ఫిరాయింపులపై ఉత్తమ్‌ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఈనీతులు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్పీకర్‌ హైదరాబాద్‌లో ఉండకుండా పారిపోయారని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం అర్థరహితమన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డిని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సంగతిని మరిచి ఇటువంటి రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇకనైనా కాంగ్రెస్‌ నేతలు నోరుదగ్గరపెట్టుకుని మాట్లాడాలని సూచించారు.  

ఫలితాల రోజు అదే తీర్పు
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు కూడా అదే తీర్పు వస్తుందని తలసాని జోస్యం చెప్పారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్‌ నేతలు కాళేశ్వరంలాంటి ప్రాజెక్టును ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే చర్యలు తీసుకున్నారని తెలిపారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.శనివారం ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్‌ టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని తలసాని, శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలి పారు. ఈ వేడుకలకు టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top