కరాటే గురు

Special Story Karate Master Rajesh  - Sakshi

500 మందికి పైగా బాలికలకు కరాటే శిక్షణ ఇస్తున్న రాజేష్‌

  ఆత్మరక్షణ విద్య అవసరాన్ని గుర్తించేలా బాలికలకు అవగాహన

వెలిగండ్ల:  ప్రస్తుత సమాజంలో బాలికలపై ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. వాటి నుంచి బాలికలు తమను తాము కాపాడుకోవడానికి ఆత్మస్థైర్యం అవసరం. కరాటే నేర్చుకోవడం ద్వారా వారిలో నమ్మకం, ఆత్మస్థైర్యం కలుగుతుంది. బాలికలకు కరాటే కవచంలాంటిది. అలాంటి కరాటేను బాలికలకు పరిచయం చేస్తున్నాడు రాజేష్‌ అనే ఓ యువకుడు. బాలికలకు కరాటే నేర్పంచడంతో పాటు తనకు జీవనోపాధిని చూసుకుంటూనే ఎప్పటికైనా ఒలింపిక్స్‌కు వెళ్లాలని ఓ కరాటే మాస్టర్‌ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు.

కరాటే అంటే ఇష్టం
మండలంలోని మొగళ్లూరుపల్లికి చెందిన అట్లూరి రాజేష్‌ డిగ్రీ చదివాడు. చిన్నతనం నుంచి ఫైట్స్‌పై మక్కువ పెంచుకున్నాడు. నర్సరావుపేటలో కరాటే మాస్టర్‌ భాస్కర్‌ వద్ద శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, నందిగామ, నంద్యాల, అద్దంకి పట్టణాల్లో నిర్వహించిన కరాటే పోటీల్లో 30కి పైగా గోల్డ్‌ మెడల్స్‌ సాధించాడు. హైదరాబాద్‌లో సుమన్‌ షుటోకాన్‌ కరాటే అకాడమీ నిర్వహించిన 8వ నేషనల్‌ లెవల్‌ ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని బ్లాక్‌ బెల్ట్, గోల్డ్‌ మెడల్‌ సాధించి, సినీ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు.

500 మందికి పైగా కరాటేలో శిక్షణ
సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల, పామూరు, కనిగిరి, పీసీపల్లి, హనుమంతునిపాడు, సీఎస్‌పురం మండలాల్లోని జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌లో 8, 9వ తరగతి చదువుతున్న బాలికలకు కరాటేలో 3 నెలల పాటు శిక్షణ అందిస్తున్నాడు.  వారంలో రెండు రోజులు రోజుకు ఒక గంట పాటు కరాటేలో బేసిక్స్‌ నేర్పిస్తున్నాడు. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వివిధ రకాల టెక్నిక్స్‌ నేర్పిస్తున్నాడు. కరాటే నేర్చుకుంటే కలిగే ఉపయోగాలు వివరిస్తున్నాడు. మూమెంట్స్, బ్లాక్స్, ఎటాక్స్‌ పై తర్ఫీదు ఇచ్చానని రాజేష్‌ తెలిపాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కరాటేని ఆత్మరక్షణ కోసం వినియోగించాలని చెప్పినట్లు రాజేష్‌ తెలిపాడు.

వ్యాయామం–ఆరోగ్యం
కరాటే నేర్చుకుంటే ఆత్మరక్షణతో పాటు మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. అంతే కాకుండా కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజేష్‌ తెలిపారు. రోజూ వ్యాయామం చేయడంతో మంచి ఆరోగ్యం పొందవచ్చన్నారు. ప్రతి పాఠశాలలో కరాటేపై బాలబాలికలకు శిక్షణ ఇస్తే చిన్నతనం నుంచే ఆత్మస్థైర్యం పొందవచ్చని రాజేష్‌ అన్నారు.

సినీ ప్రముఖులతో ప్రశంసలు
కరాటే పోటీల్లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన రాజేష్‌ పలువురు సినీ ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నారు. సినీ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్, సినీనటుడు సుమన్, గిరిబాబు, చలపతిరావు, భానుచందర్‌తో ప్రశంసలు అందుకున్నాడు. నవంబర్‌ 4వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించిన నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పీసీపల్లి కస్తూర్బా పాఠశాలకు చెందిన బాలికలు ప్రథమ స్థానంలో, హనుమంతునిపాడు కస్తూర్బా పాఠశాల బాలికలు ద్వితీయ స్థానం సాధించారు. రెండు పాఠశాలల విద్యార్థులను సినీనటుడు సుమన్‌ అభినందించారని కరాటే మాస్టర్‌ రాజేష్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top