ఆదుకునేవారేరీ

Special story On Gulf Country Victims In warangal - Sakshi

సాక్షి, బొమ్మెన భూమేశ్వర్(వరంగల్‌) : ఉపాధి కోసం షార్జా వెళ్లిన ఆ వ్యక్తి తోటి కార్మికునితో జరిగిన ఘర్షణలో చనిపోవడంతో అతని కుటుంబం దిక్కులేనిదైంది. అతని భార్య పెద్ద దిక్కును కోల్పోయి బాధను దిగమింగుకుంటూనే కుటుంబ భారాన్ని మోసింది. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌కు చెందిన గోవర్దన్, జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం కొత్తపేట్‌కు చెందిన ధరూరి బుచ్చన్న ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒకే గదిలో నివాసం ఉండేవారు. 2001లో నివాస గదిలో ఇద్దరి మధ్య క్షణికావేశంలో జరిగిన ఘర్షణలో గోవర్దన్‌ మరణించాడు. గోవర్దన్‌ మరణానికి బుచ్చన్నను కారకునిగా గుర్తించిన షార్జా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా అతనికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. బుచ్చన్న 18 ఏళ్ల నుంచి షార్జా జైలులోనే మగ్గిపోతున్నాడు.  

కడసారి చూపు కూడా దక్కలేదు.. 
షార్జాలో మరణించిన గోవర్దన్‌ మృతదేహాన్ని ఆర్థిక, సాంకేతిక కారణాలతో భారత్‌కు పంపలేదు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులు కడసారి చూపునకు కూడా నోచుకోలేదు. గోవర్దన్‌పై ఆధారపడిన భార్య రాధ, కొడుకు నవీన్, కూతురు రవళిలు పెద్ద దిక్కును కోల్పోయారు. రాధ బీడీలు చుడుతూనే తన పిల్లలను పోషించింది. తన రెక్కల కష్టంతో కూతురును, కొడుకును చదివించి పెంచి పెద్ద చేసింది. వారి పెళ్లిళ్లను జరిపించి తన బాధ్యతను నెరవేర్చుకున్న ఆమె.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోవర్దన్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. 

పెద్ద మనసుతో క్షమాభిక్ష.. 
షార్జా జైలులో మగ్గుతున్న బుచ్చన్న కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. షరియా చట్టం ప్రకారం మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే బుచ్చన్న షార్జా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. బుచ్చన్న సోదరులు లక్ష్మణ్, లింగన్న, మేనల్లుడు రాజేష్‌ ఇటీవల ముప్కాల్‌ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దల సమక్షంలో గోవర్దన్‌ కుటుంబ సభ్యులను కలిసి క్షమాబిక్ష కోసం ప్రాధేయపడ్డారు. పెద్దమనసు చేసుకుని బుచ్చన్నకు క్షమాబిక్ష లేఖ ఇచ్చి, శిక్ష రద్దుకు సహకరించాలని వేడుకోగా.. ఎట్టకేలకు గోవర్దన్‌ భార్య రాధ ఒప్పుకుంది. 

పరిహారం కోసం ప్రయత్నాలు..  
క్షమాభిక్ష లేఖతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు జైల్లో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు కొంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బును షార్జా న్యాయస్థానంలో జమచేయడం గానీ, బాధిత కుటుంబ సభ్యులకు నేరుగా గానీ ఇవ్వాలి. అయితే, బుచ్చన్న కుటుంబ సభ్యులకు అంత ఆర్థిక స్థోమతలేదు. విరాళాలు సేకరించి గోవర్దన్‌ కుటుంబానికి చెల్లించి బుచ్చన్నను విడిపించడానికి కొన్ని దళిత సంఘాలు, కొందరు ప్రవాసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వలసదారుల హక్కుల మండలి అధ్యక్షుడు పి.నారాయణ స్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం 2011 డిసెంబర్‌లో షార్జా జైలును సందర్శించి బుచ్చన్నను కలిసి వచ్చారు. గోవర్దన్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని, బుచ్చన్నను జైలు నుంచి విడుదల చేయాలని నారాయణ స్వామి గతంలో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top