గద్దెనెక్కిన వరాల తల్లి

Special Story About Medaram Sammakka Saralamma Jatara - Sakshi

సాయంత్రం 6:29 గంటలకు చిలకలగుట్ట దిగిన సమ్మక్క

మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మేడారం సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. అడవి అంతా జనాలతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతిముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంఛనాలు, పోలీసు ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం, భారీ బందోబస్తు మధ్య ఆదివాసీలు, సమ్మక్క పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు.

ఆదివాసీ జాతరలో పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క ఉండే చిలకలగుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడి నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే ఆదివాసీ జాతర ప్రధాన ఘట్టం గురువారం సాయంత్రం 6:29 గంటల నుంచి రాత్రి 9:09 గంటల వరకు ఉద్విఘ్నంగా సాగింది.

వేకువజాము నుంచే.....
వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం వేకువజామునే మొదలైంది. సమ్మక్క పూజారులు, వడ్డెలు ఉదయం 5.30 గంటలకు మేడారం సమీపంలోని వనంలోకి వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు, ఆలంకరణలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాల (కొత్త కుండలు)ను కూడా గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం సాయంత్రం 4 గంటలకు చిలకలగుట్టపైకి బయలుదేరింది.

అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. సమ్మక్క రాక సందర్భంగా చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు ఉన్న కిలోమీటరు దారి మొత్తం రంగురంగుల ముగ్గులు వేసి భక్తులు యాటపోతులను బలిచ్చి మొక్కుకున్నారు. సమ్మక్కకు ఆడపడుచులు, ముత్తయిదవులు నీళ్ల బిందెలు, మంగళ హారతులతో స్వాగతం పలికారు.

సమ్మక్క రాక సందర్భంగా గౌరవ సూచకంగా తుపాకీ పేలుస్తున్న ఎస్పీ  సంగ్రాం సింగ్‌ జీ పాటిల్‌

సాయంత్రం 6:29 గంటలకు...
గురువారం సాయంత్రం 6:29 గంటలకు కుంకుమ భరణి రూపంలో ఉన్న అడవితల్లి సమ్మక్కతో పూజారులు చిలకలగుట్ట దిగడం ప్రారంభించారు. వారు వస్తున్న విషయం తెలియడంతో ఒక్కసారిగా అక్కడున్న శివసత్తులు, మహిళలు పూనకాలతో ఊగిపోయారు. భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. ఈ ఉద్విఘ్నత కొనసాగుతుండగానే సమ్మక్కతో వడ్డే కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్ట దిగారు. మిగిలిన పూజారులు, వడ్డెలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు.

సమ్మక్క రాకకు సూచికగా దేవతను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ ఏకే 47 తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ శబ్దం విన్నవెంటనే చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో చిలుకలగుట్ట ప్రాంతం మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల రోప్‌ పార్టీ నడుమ పూజారులు, వడ్డెలు సమ్మక్క కుంకుమ భరిణె రూపంతో మేడారంవైపు బయలుదేరారు.

చిలకలగుట్ట నుంచి ఫెన్సింగ్‌ వరకు సమ్మక్క చేరుకునేలోపు ఎస్పీ మొత్తం 3 సార్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య పూజారులు, ఆదివాసీల మధ్య సమ్మక్కను మేడారం గద్దెలపైకి తరలించడం మొదలుపెట్టారు. చిలుకలగుట్ట నుంచి మేడారం వరకు లక్షల మంది భక్తులు సమ్మక్క రాకను చూసి తన్మయత్నం చెందారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

శివసత్తులు పూనకాలతో ఊగారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని దారిలో సమ్మక్క రూపంపై వెదజల్లారు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజా రులు అక్కడి నుంచి ఎదురుకోళ్ల పూజా మందిరం చేరుకున్నారు. పూజారులు 5 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకొస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అనంతరం పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సరిగ్గా రాత్రి 9:09 గంటల సమయంలో గద్దెపై సమ్మక్కను ప్రతిష్టించాక విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. మొదట మేడారంవాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఎదుర్కోళ్లు ఎగుర వేస్తున్న భక్తులు

మెగా సిటీగా మేడారం
వరంగల్‌: దట్టమైన అటవీ ప్రాంతంలోని మేడారం.. జాతర సమయంలో మెగా సిటీ గా మారుతుంది. సాధారణ పల్లె ప్రతీ రెండేళ్లకోసారి వారం పాటు తన స్వరూపాన్ని గు ర్తు పట్టలేనంతగా మార్చుకుంటుంది. ఎం తంటే ఐదు లక్షల కుటుంబాలు, కోటి మం దికి పైగా జనాభా జాతరకు చేరుకుంటారు. మేడారం జాతరకు మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మ హారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆదివాసీలు, గిరిజనులు వస్తారు. పొరుగు రాష్ట్రాల నుం చి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రధా న అడ్డంకి గోదావరి నది. మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు సిరోంచ తర్వాత ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఏటూరునాగారం, కాళేశ్వరం వద్ద నిర్మిం చిన హైలెవల్‌ వంతెనల మీదుగా మేడారం చేరుకుంటారు.

జాతరపై వర్సిటీలో పరిశోధనలు 
1975లోనే వరంగల్‌లో కేయూ ప్రారం భం కాగా.. 1980వ దశకంలో వర్సిటీలో చరిత్ర విభాగం తన పరిశోధనలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమ్మక్క–సారలమ్మలతో పాటు కాకతీయులపై చెప్పుకోతగిన పరిశోధనలు జరగలే దు. 2006లో దివిటి అంజనీదేవి సమ్మక్క– సారలమ్మ జాతరపై ఓ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురాగా, అంతకు ముందు రాజ్‌ మహ్మద్‌ ఉస్మానియా వర్సిటీ ద్వారా పరిశోధనలు చేశారు. ఇటీవల గిరిజన విజ్ఞానపీఠం ద్వారా కొన్ని పుస్తకాలు ప్రచురితమయ్యాయి.

జాతరలో జంపన్న పుట్టిండు!

మగబిడ్డతో శివాణి
భూపాలపల్లి అర్బన్‌ : మేడారం మహాజాతరకు వచ్చిన భక్తురాలు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన 50 ఆస్పత్రిలో వైద్యులు గురువారం ఆమెకు సాధారణ ప్రసవం చేయడంతో పాటు కేసీఆర్‌ కిట్‌ అందజేశారు. పుణేకు చెందిన చావని శివాణి కుటుంబ సభ్యులతో కలసి రెండు రోజుల క్రితం జాతరకు వచ్చింది.  గురువారం పురుటి నొప్పులు రావడంతో 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ప్రసవం చేయడంతో శివాణి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో జంపన్నే తమకు పుట్టాడని శివాణి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

హుండీలు గలగల!

మొక్కుబడులతో నిండిన హుండీలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల వద్ద 429 హుండీలను ఏర్పాటు చేశారు. జాతరలో రోజుకు సుమారు 40 నుంచి 50 హుండీలు నిండుతున్నాయి. ఇప్పటి వరకు 212 హుండీలు నిండినట్లు దేవాదాయ శాఖ అధికారులు గురువారం తెలిపారు.

బస్సుల సందడి

భూపాలపల్లి: మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క తల్లి గద్దెను చేరడంతో భక్తులు దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి వరకు మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో వందలాది బస్సులు అధికారులు అందుబాటులో ఉంచారు. బస్టాండ్‌లో నిలిపి ఉంచిన వివిధ డిపోల బస్సులను పైనుంచి ఇలా అగ్గిపెట్టెల్లా దర్శనమిచ్చాయి.

జనసందోహంగా మేడారం.. ప్రముఖుల మొక్కులు

సమ్మక్క గద్దెను మొక్కుతున్న మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే సీతక్క
నలుగురు వన దేవతలు... సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం గద్దెల ప్రాంతం భారీగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక్కరోజే ఏకంగా 30 లక్షల మంది వరకు మేడారానికి తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారం మేరకు మేడారానికి వచ్చిన భక్తుల సంఖ్య శుక్రవారం కోటికి చేరనుందని భావిస్తున్నట్లు దేవాదాయ, సమాచార పౌరసంబంధాల శాఖల అధికారులు పేర్కొన్నారు.

అమ్మవార్లకు పూలు, పండ్లు సమర్పిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, చిత్రంలో తలసాని
కాగా, మేడారంలో గురువారం పలువురు ప్రముఖులు వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్నారు. తల్లులను దర్శించుకున్న వారిలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సత్యవతి రాథోడ్, ఈటల రాజేందర్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే ధనసరి సీతక్క, కలెక్టర్‌ ఆర్‌.వి. కర్ణన్, ప్రత్యేకాధికారులు వి.పి. గౌతమ్, కృష్ణ ఆదిత్య, సీపీ డాక్టర్‌ రవీందర్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్, ఏఎస్పీ సాయిచైతన్య తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top