ఆస్తమా పేషెంట్లు భయపడొద్దు | Sakshi
Sakshi News home page

ఆస్తమా పేషెంట్లు భయపడొద్దు

Published Wed, May 6 2020 3:49 AM

Special Interview With Doctor Vishwanath Gella On Covid 19 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి సోకే అవకాశాలున్న పది ప్రధానమైన రోగలక్షణాలు, కారణాల్లో ఆస్తమా వ్యాధి లేదని పల్మనాలజిస్ట్, స్లీప్‌ డిజార్డర్స్‌ నిపుణులు డా.విశ్వనాథ్‌ గెల్లా స్పష్టం చేశారు. ఆస్తమా కారణంగా ఈ వ్యాధి తమకు త్వరగా సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఆస్తమా పేషెంట్లు కూడా సాధారణ రోగుల మాదిరిగా ఈ వైరస్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాజాగా అమెరికా, చైనా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైందన్నారు. ఇప్పటివరకు చైనా, అమెరికా, తదితర దేశాల్లో కరోనా కారణంగా సంభవించిన మరణాల్లోనూ ఆస్తమా ఉన్న వారు దాదాపుగా లేనట్టేనని తేలిందన్నారు.

గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజెస్, 2018 అధ్యయనం ప్రకారం భారత్‌లో దాదాపు 4కోట్ల మంది ఆస్తమా రోగులున్నారని, వారిలో 5 శాతం మందిలో ఇది తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. ఇలాంటి పేషెంట్లు మాత్రం కరోనాకు గురయ్యే అవకాశాలున్నాయన్నారు. హ్యాండ్‌ హైజీన్‌ను పాటించే విషయంలో సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని, ఎంత సమయంపాటు చేతులు కడుక్కోవాలి, దానికోసం అనుసరించాల్సిన విధానాలు తెలుసుకోవాలన్నారు. మంగళవారం (మే 5) ‘వరల్డ్‌ ఆస్తమా డే’, ‘వరల్డ్‌ హ్యాండ్‌ హైజీన్‌ డే’ల సందర్భంగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వూ్యలో పల్మనాలజిస్ట్‌ డా. విశ్వనాథ్‌ గెల్లా వివిధ అంశాలపై ఏం చెప్పారంటే...
ఆస్తమా ఆ జాబితాలో లేదు: కరోనా ప్రధానంగా డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, శ్వాసకోశ సంబంధి త, సీవోపీడీ వంటి పది రకాల లక్షణాలు, ఇప్పటికే వివిధ రకాల ఆరోగ్య సమస్యలున్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. ఆ జాబితాలో ఆస్తమా లేదు.

ఇన్‌హేలర్స్‌ మానొద్దు...
ఆస్తమా చికిత్సలో భాగంగా వాడుతున్న ఇన్‌హేలర్ల వినియోగాన్ని రోగులు ఆపొద్దు. వీటిని ఆపేసి ఆందోళనలతో ఆసుపత్రులకు వెళ్లి స్టెరాయిడ్స్‌ డోస్‌ పెంచడం వల్ల సమస్యలు ఎదురుకావొచ్చు. జపాన్‌ పరిశోధనల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తమా ఉన్నవారు ఇన్‌హేలర్స్‌ను మానాల్సిన అవసరం లేదు.

టెలి మెడిసిన్‌కు ప్రాధాన్యతనివ్వాలి...
ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో, టెలి మెడిసిన్‌ కన్సల్టేషన్‌ ద్వారా మందులు తీసుకోవడం మంచిది. ఆసుపత్రులకు వెళ్లడం వల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది. ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం సంబంధిత డాక్టర్‌ని నేరుగా కలవాలి. తమకు తాము ఇన్‌హేలర్‌ డోస్‌ తగ్గించుకోవడం సరికాదు. ఆస్తమా రోగులు అక్యూట్‌ అటాక్‌ రాకుండా జాగ్రత్త పడాలి.

అలర్జీలతో జాగ్రత్త పడాలి...
ప్రస్తుత సమయంలో ఆస్తమా రోగులు అలర్జీల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. కార్పెట్‌తో వచ్చే అలర్జీలు, దుమ్ము, కొన్నిరకాల ఫాబ్రిక్స్, వాసనలు, వృత్తిరీత్యా వచ్చేసమస్యలతో అలర్జీలు వస్తాయి. అలర్జెక్‌ రునటిక్స్‌ ఉంటే తుమ్ములు, జలుబు వంటివి వస్తాయి. ప్రాణాయామం చేయగలిగితే మంచి ఫలితాలుంటాయి.

చేతులు శుభ్రపరుచుకునేందుకు...
చేతులను శుభ్రం చేసుకునే విషయంలో కూడా పది స్టెప్స్‌ను పాటించాలి. రోజువారీ జీవనంలో శుభ్రతా చర్యలకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. బయట తిరిగొచ్చిన చెప్పులతో ఇంట్లో తిరగడం సరైంది కాదు.

Advertisement
Advertisement