ఎంపీగా పోటీ చేస్తా.. లోన్‌ ఇవ్వండి..! | Social Worker Application For Loan To Contest Elections | Sakshi
Sakshi News home page

ఎంపీగా పోటీ చేస్తా.. లోన్‌ ఇవ్వండి..!

Mar 12 2019 7:47 AM | Updated on Mar 12 2019 3:40 PM

Social Worker Application For Loan To Contest Elections - Sakshi

హైదరాబాద్‌: ‘ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను.. ఎన్నికల ఖర్చుల కోసం రుణం మంజూరు చేయండి’ అని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త నల్లకుంటలోని కెనరా బ్యాంక్‌లో దరఖాస్తు చేసుకున్నారు. బాగ్‌అంబర్‌పేటలో నివాసముండే కె.వెంకటనారాయణ సామాజిక కార్యకర్త. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీనికి అవసరమైన ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ. 5 లక్షల రుణం మంజూరు చేయాలని కోరుతూ బ్యాంక్‌ మేనేజర్‌కు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా అవినీతిపై ప్రత్యక్ష ఉద్యమాల ద్వారా పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ విభాగాల్లో జరిగే అవినీతి కుంభకోణాలను వెలికితీసి అవినీతిపరులను కోర్టుకు లాగుతున్నానని వివరించారు.

తన సేవలను గుర్తించిన తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య తనను సన్మానించి పురస్కారం అందజేశారని గుర్తు చేశారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. పేదరికం కారణంగా ఎన్నికల వ్యయాన్ని భరించలేకపోతున్నానని తెలిపారు. ఈ కారణంగానే రుణం కోసం దరఖాస్తు చేశానని వివరించారు. తాను గతంలో కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకున్నానని.. అయినా తనకు రుణం మంజూరు చేయలేదని తెలిపారు. ఈ సారైనా రుణం మంజూరు చేస్తే, వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లిస్తానని వెంకటనారాయణ హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement