కాటేస్తున్నాయ్‌!

Snake Bite medicines Shortages In District Centres hyderabad - Sakshi

రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య  

జిల్లా కేంద్రాల్లో కొరవడిన సదుపాయాలు   

చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి పరుగులు

ఆరు నెలల్లోనే 149 పాముకాటు కేసులు  

సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో దుక్కులు దున్నే సమయంలో పుట్టలు, ఏపుగా పెరిగిన గడ్డి నుంచి పాములు బయటికి వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల రైతులు పాముకాటుకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరుతున్న  బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి 149 పాము కేసులు వచ్చాయి. ఇప్పటికే ముగ్గురు మృతి చెందడం గమనార్హం. పాము కాటుతో పాటు ఇతర విషపు పురుగులు కుట్టి ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. గ్రేటర్‌ శివారు ప్రాంతాల నుంచే కాకుండా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల నుంచి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఆయా జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ స్నేక్‌ వీనం మందుతో పాటు వెంటిలేటర్‌ సపోర్ట్, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియాకు పరుగులు తీస్తున్నారు. పాము కాటును గుర్తించి, ఆస్పత్రికి తరలింపులో తీవ్రజాప్యం జరుగుతుండటంతో బాధితులు మృత్యువాతపడుతున్నారు.  

మూడు గంటలు మించితే ప్రాణాపాయమే..
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నట్లు ఓ అంచనా. మన దేశంలో ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుంది. దేశంలో దాదాపు 250 జాతుల పాములంటే వాటిలో 52 విషసర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో కనిపించే పాముల్లో 5 జాతులు మాత్రం అత్యంత విషపూరితమైని. ఇవి కాటేసిన మూడు గంటల్లో మనిషి చనిపోతాడు. ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. లేనిపక్షంలో ప్రాణాలకు ముప్పు తప్పదు. కాటువేసిన పాము విషపూరితమైనదా కాదా అని తెలుసుకోవాలంటే కరిచిన చోట ఎన్ని గాట్లున్నాయో పరిశీలించాలి. ఒకటి లేదా రెండు కాట్లు ఉంటే విషపూరితమైందని.. మూడు అంతకంటే ఎక్కువ ఉంటే విషరహితమైందిగా గుర్తించాలి. విషపూరిత సర్పం కాటువేస్తే గాయమైన ప్రాంతం నుంచి విషం శరీరంలోకి చేరుతుంది. అక్కడి నుంచి గుండెకు, గుండె నుంచి ఇతర శరీర భాగాలు, మెదడుకు రక్తం ద్వారా చేరుకుంటుంది. పాము విషం అన్ని శరీర భాగాలకు చేరడానికి మూడు గంటలు పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయి. 

ఈ జాగ్రత్తలు పాటించాలి..   
విషపూరిత సర్పం కరిచిన వెంటనే గాయంపై అంటే గుండె వైపు బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని పాము కాటువేసిన గాయం దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు లాగాలి. మొదట రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తమని అర్థం. ఇలా రెండు మూడు సార్లు చేస్తే ఆ వ్యక్తి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 ఎంఎల్‌ నుంచి 2 ఎంఎల్‌ వరకు మాత్రమే. అలాగే కేవలం రూ.5 నుంచి రూ.10 విలువుండే నాజా 200 అనే 5ఎంఎల్‌ హోమియోపతి ఔషధం ఇంట్లో ఉంచుకోవాలి. దీనిని పాము కాటుకు గురైన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి మూడుసార్లు వేస్తే త్వరగా కోలుకుంటాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top