సీఎం దృష్టికి తీసుకెళ్తాం

Smita Sabharwal: Thummilla Project Works Will Move To KCR - Sakshi

తుమ్మిళ్ల’ను పరిశీలించిన సీఎంఓ కార్యదర్శి

ఆయకట్టుకు సాగునీటి  విడుదల, పెండింగ్ పనులపై ఆరా

రెండో విడత పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష

సాక్షి, అలంపూర్‌(మహబూబ్‌నగర్‌) : తుమ్మిళ్ల ఎత్తిపోతలలో చేపట్టాల్సిన పనులను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ చెప్పారు. మంగళవారం ఉదయం రాజోళి మండలంలోని ఈ పథకాన్ని ఆమె పరిశీలించారు. అంతకుముందు హెలికాప్టర్‌లో తుమ్మిళ్లకు చేరుకున్న ఆమెకు జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్‌ శశాంక స్వాగతం పలికారు. అనంతరం అల్పాహారం తీసుకున్న ఆమె పథకం పనులను పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తుమ్మిళ్ల పథకంలోని జీరో పాయింట్‌ వద్దకు రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్, సీఈ అనంతారెడ్డిలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తుంగభద్ర నది నుంచి అప్రోచ్‌ కెనాల్‌లోకి నీరు వచ్చే విధానాన్ని పరిశీలించారు.

తుంగభద్ర నదిలో వరద నీరు ఎన్ని రోజులు కొనసాగుతుందో, నది అవతలివైపు ఉన్న గ్రామాలపై అధికారులతో ఆరా తీశారు. సమీపంలోని సుంకేసుల బ్యారేజీ, కేసీ కెనాల్‌ వివరాలను అడిగారు. ఈ లిఫ్టులో ప్రస్తుతం రెండు 5.5 హెచ్‌పీ, మరొకటి 10.5హెచ్‌పీ మోటార్లు ఉన్నాయని అధికారులు బదులిచ్చారు. ప్రస్తుతం మొదటి విడత పనులు పూర్తి కాగా, ఒక 5.5హెచ్‌పీ మోటార్‌ ద్వారా మాత్రమే నీటి పంపింగ్‌ అవుతోందన్నారు. అనంతరం తనగల వద్ద ఉన్న ఆర్డీఎస్‌ కెనాల్‌ డి–23 వద్దకు ఆమె వెళ్లి లిఫ్ట్‌ నుంచి నీరు చేరుకోవడాన్ని పరిశీలించారు. 

రెండో దశ పనులపైనా.. 
ఈ ఎత్తిపోతలలో భాగంగా రెండో దశలో చేపట్టాల్సిన రిజర్వాయర్లకు స్థల సేకరణకు రైతులు సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే దానిపై స్మితాసబర్వాల్‌ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్‌ ప్రాజెక్టు మాజీ చైర్మన్‌ సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. 1.1 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు సంబంధించి సుమారు వంద ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. మిగతా భూమిని సేకరించేందుకు అధికారులు సన్నద్ధమైతే రైతులు తప్పకుండా సహకరిస్తారన్నారు. ఈ ఎత్తిపోతల ద్వారా శాశ్వత ప్రయోజనాలు కలగాలంటే రిజర్వాయర్ల నిర్మాణం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది బాగా వర్షాలు కురవడం, ఎగువ నుంచి తుంగభద్రకు వరద నీరు రావడం వల్ల నీరు సమృద్ధిగా ఉందన్నారు. ఏటా ఇలాగే ఉంటుందని భావించలేమని, దీనిని దృష్టిలో ఉంచుకుని, వీలైనంత త్వరగా రిజర్వాయర్లు నిర్మించి, ఆర్డీఎస్‌ కెనాల్‌ను ఆధునికీకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు రేణుక, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రఘునాథ్‌రావు, ఈఈ శ్రీనివాసులు, డీఈ శ్రీనివాస్, ఏఈఈలు శివరాజు, అంజనేయులు, వరుణ్‌ పాల్గొన్నారు.


ఆర్డీఎస్‌ కెనాల్‌ వద్ద డెలివరీ సిస్టర్న్‌లో నీటి విడుదలను పరిశీలిస్తున్న అధికారులు

పకడ్బందీగా ‘ప్రణాళిక’ పనులు 
గ్రామాల్లో ‘ప్రణాళిక’ పనులు పకడ్బందీగా నిర్వహించాలని సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఆదేశించారు. తుమ్మిళ్ల పంప్‌హౌస్‌ సమీపంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం, ప్రణాళిక పనులపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని, వీటి ద్వారా భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్‌ ఏఈఈ శివరాజ్, డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటరమణ,  తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top