ఆగస్టులో ట్రయల్‌ రన్‌

Sitarama Project Works Process In Khammam - Sakshi

ములకలపల్లి: సీతారామ ప్రాజెక్టు మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తెలిపారు. మండల పరిధిలోని వీకే రామవరం, కమలాపురం గ్రామాల్లో జరుగుతున్న పంప్‌హౌస్, కెనాల్‌ నిర్మాణ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వీకే రామవరంలో జరుగుతున్న పనులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కమలాపురంలో పనులు నత్తనడకన జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు.

కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకుని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం పనులు చేయాలి కాని.. కుంటిసాకులు చెప్తూ జాప్యం చేయడమేమిటని ఏజెన్సీలను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పనులు జరగకపోవడానిక కారణాలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జాప్యం జరిగిన రోజులకు సంబంధించి సిబ్బంది వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. సైట్‌ మేనేజింగ్, ఇంజనీరింగ్‌ అధికారుల మధ్య సమన్వయం ఏమాత్రం లేదన్నారు. దశల వారీగా రోజుకు ఎంత పని చేయాల్సి ఉందనే అంశంపై ప్రణాళిక తయారుచేసుకుని దాని ప్రకారం పనులు చేస్తే త్వరగా పూర్తవుతాయన్నారు.

రోజువారీ ఎంత కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకుని, మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను అందచేస్తామని, ఆ ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మొదటి, రెండు, మూడు పంప్‌హౌస్‌ల పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా సీఎం కార్యాలయం నుంచి సీసీ టీవీలు ఏర్పాటు చేసుకుని పనులను ప్రతీ రోజూ పర్యవేక్షిస్తానన్నారు. ప్రాజెక్ట్‌ మొదటి, రెండో దశలకు 6 మోటార్లు, మూడో దశకు 7 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, మొదటి దశకు ఆగస్టు చివరి నాటికి ట్రయల్‌రన్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు

గ్రావిటీ కెనాల్‌ 1,2,3,4,7,8 పనులు అక్టోబర్‌ మాసం చివరి నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సివిల్‌ పనుల్లో వేగం పెంచాలని, రానున్న వర్షాకాలం నాటికి సివిల్‌ పనులు పూర్తి చేయకపోతే వర్షాల వలన ఇబ్బందులు వస్తాయన్నారు. బీజీ కొత్తూరుకు వస్తుండగా కాలువ పనులు జరగడంలేదని గుర్తించానని, ఒక్క మనిషి కూడా కాలువ పనులు చేయడంలేదన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా  కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ, సీఎంఓ ఓఎస్డీ పెద్దారెడ్డి, ఈఈ నాగేశ్వరరావు, ములకలపల్లి తహశీల్దార్‌ ముజాహిద్, ప్రతిమ ఏజెన్సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పనులు త్వరితగతిన పూర్తి చేయాలి 
అశ్వాపురం: సీతారామ ప్రాజెక్ట్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని  ముఖ్యమంత్రి  ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ నిర్మాణ సంస్థను, అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్ట్‌  ప్యాకేజీ–1లో భాగంగా  మండల పరిధిలోని బీజీకొత్తూరులో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్‌ మొదటి పంప్‌హౌస్‌ పనులను ముఖ్యమంత్రి ఓఎస్‌డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇరిగేషన్‌ సలహాదారు పెంటారెడ్డి, జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీతో కలిసి సీఎం ప్రత్యేక కార్యదర్శి  స్మితా సబర్వాల్‌ శుక్రవారం  సందర్శించారు.  పంప్‌హౌస్‌ పనులు పరిశీలించారు. అధికారులతో  మాట్లాడి పంప్‌హౌస్,  ప్యాకేజీ–1 కెనాల్, వంతెనల నిర్మాణ  పనులు జరుగుతున్న తీరు, పనులు ఎంత వరకు పూర్తయ్యాయి, పనుల్లో  పురోగతిని, గోదావరి జలాలు పంప్‌హౌస్‌ వరకు ఎప్పటి వరకు తరలిస్తారనే వివరాలు  తెలుసుకున్నారు.

 బీజీకొత్తూరు పంప్‌హౌస్, ప్యాకేజీ–1 కెనాల్, కెనాల్‌పై వంతెనల నిర్మాణాలు అనుకున్నంత వేగంగా జరగడం లేదని,  జనవరి 23న పనులను సందర్శించిన సమయంలో మార్చిలో  మోటర్లు డ్రై రన్‌ నిర్వహించి మే నెల కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పనుల్లో ఎలాంటి  పురోగతి లేదని,  పనులపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని  స్మితా సబర్వాల్‌  అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యంపై నిర్మాణ సంస్థ, అధికారులపై  తీవ్ర స్థాయిలో  ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో అలసత్వం వహిస్తే వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ మొదటి  పంహౌస్‌ , కెనాల్‌  పనులు వేగవంతం చేయాలన్నారు. మోటర్లు, పంపులు  అమర్చే పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  ఖరీఫ్‌ కల్లా పాలేరు జలాలకు సీతారామ జలాలు అనుసంధానం చేసేలా పనుల్లో వేగం పెంచాలన్నారు.   ప్రాజెక్ట్‌ పనుల్లో అలసత్వం వహించినా, పనులు గడువు లోపు పూర్తి చేయకున్నా ఊరుకునేది లేదని తగిన చర్యలు తప్పవని   నిర్మాణ సంస్థను, ప్రాజెక్ట్‌ అధికారులను హెచ్చరించారు.  ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులకు సంబంధించి ప్రతీ రోజు జరిగిన పనులపై తనకు పూర్తి  నివేదిక అందజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్ట్‌  ఎస్‌ఈ టీ.నాగేశ్వరరావు, ఈఈ బాబూరావు,  డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ రంగరాజన్,  జీఎం శ్రీనివాసరావు,  ఏఈలు రమేష్, శ్రీనివాస్, స్వాతి, రాజీవ్‌గాం«ధీ, దుర్గాప్రసాద్, మణుగూరు  డీఎస్‌పీ సాయిబాబా, సీఐ రమేష్,   తహసీల్దార్‌ అరుణ, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top